ఇలాగైతే లక్ష్మీదేవి వుండదట !
లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడం కోసం వారి ఇంటికి నేరుగా వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించే సమయంలో లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అందువలన ఈ సమయంలో వీధి తలుపులు వేయకూడదని చెబుతుంటారు. తలుపులు మూసి వుంచడం వలన, అక్కడి వరకూ వచ్చిన లక్ష్మీదేవి వెంటనే వెనుదిరుగుతుందట. అదే జరిగితే అంతకు మించిన దురదృష్టం ఇంకొకటి వుండదు.
లక్ష్మీదేవి అలా నడచివస్తూ తన భక్తులకి సంబంధించి ఎవరి ఇల్లు పవిత్రంగా అనిపిస్తూ వుంటుందో వాళ్ల ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే వీధి గుమ్మం దగ్గర పాదరక్షలు ఉండకూడదని అంటారు. అలాగే ఆ సమయంలో ఇల్లు ఊడ్చిన చెత్త బయట పడేయకూడదని చెబుతుంటారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడదామని అనుకుంటూ వుండగా, ఆ సమయంలో ఇల్లు ఊడ్చిన చెత్తతో ఎదురుపడకూడదనేదే ఇందులోని ఉద్దేశంగా కనిపిస్తూ వుంటుంది.
ఇక కొంతమంది రాత్రి భోజనాలుగానీ .. అల్పాహారంగాని చేసిన తరువాత, ఆ అంట్లను అలాగే వుంచేస్తుంటారు. ఉదయాన్నే శుభ్రం చేయవచ్చనీ ... పనివాళ్లకి వేయవచ్చని గాని అలా చేస్తుంటారు. కానీ రాత్రి తాలూకు అంట్లు అలా ఉంచకూడదని అంటారు. ఈ విధమైన అలవాటు వున్న చోట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదట. అందువలన రాత్రి వేళకి సంబంధించిన అంట్లను వెంటనే శుభ్ర పరచుకోవడం మంచిదని చెబుతుంటారు.