ఆషాఢ అమావాస్య ప్రత్యేకత
సాధారణంగా అమావాస్య అనేది పితృదేవతలను ఆరాధించే ముఖ్యమైన రోజుగా భావిస్తుంటారు. ఇక ఈ విషయంలో ఆషాఢ అమావాస్య మరింత ముఖ్యమైనదిగా చెబుతుంటారు. ఈ రోజున పితృకార్యాలను నిర్వహిస్తూ, వారి ఆత్మలకు సంతృప్తిని చేకూరుస్తుంటారు. వారి ఆశీస్సులే తమను నడిపిస్తాయని నమ్ముతుంటారు.
ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా కూడా పిలుస్తుంటారు. వివాహితులైన స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ ఈ రోజున వ్రతాన్ని చేస్తుంటారు. దీప స్తంభానికి సున్నపు చుక్కలు పెట్టడం ... నైవేద్యంగా పచ్చి పిండితో చుక్కలు పెట్టడం, వెండి చుక్కను గానీ ... బంగారు చుక్కను గాని దానంగా ఇవ్వడం ఈ వ్రత విధానంలో ప్రత్యేకంగా కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే దీనిని చుక్కల అమావాస్య అని అంటారు.
ఈ రోజున కొన్ని ప్రాంతాలలో 'దీపపూజ'ను నిర్వహిస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో ఒక వేదిక వంటిది ఏర్పాటు చేసుకుని, దానిపై ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో ప్రమిదలు వుంచి వెలిగించి, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ రోజున సాయంత్రం కూడా ఇదే విధంగా దీపాలను పూజించి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శుభం జరుగుతుందని విశ్వసిస్తుంటారు.