వ్యాధులను నివారించే శివలింగార్చన
పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తూ వుంటాయి. ఆశలు నెరవేర్చుకునే అవకాశం లేక ... ఆశయాన్ని సాధించే శక్తిలేక వ్యాధిగ్రస్తులు నానా ఇబ్బందులు పడుతుంటారు. తమ తోటివారితో కలవలేక ... వాళ్లతోపాటు సంతోషాలలోను ... సంబరాలలోను పాలుపంచుకోలేక ఆవేదన చెందుతుంటారు.
అలాంటి వ్యాధుల బారి నుంచి బయటపడాలంటే, పాపాలకు పరిహారం చేసుకోవాలి. పుణ్యరాశిని పెంచుకుంటూ పోవడం వలన, పాపఫలితాల నుంచి లభించే ఉపశమనం కూడా పెరుగుతూ వుంటుంది. అలాంటి పుణ్యరాశిని పెంచుకోవడానికిగాను భగవంతుడిని అనునిత్యం సేవిస్తూ వుండాలి.
భగవంతుడి అనుగ్రహం వలన తగ్గని వ్యాధంటూ వుండదు. దైవానుగ్రహంతో మరణాన్ని సైతం జయించిన మహాభక్తుల కథలను ఇక్కడ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శివలింగార్చన అత్యున్నతమైన ఫలితాలను అందిస్తోందని చెప్పబడుతోంది. ఒక్కోరకం శివలింగాన్ని అర్చించడం వలన ఒక్కో విశేష ఫలితం వుంటుంది.
ఈ నేపథ్యంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతోన్న వాళ్లు, 'పటికబెల్లం'తో చేసిన శివలింగాన్ని అర్చించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. పటికబెల్లంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన, పాపాలు .. దోషాలు నశించి వాటి ఫలితంగా అనుభవిస్తోన్న వ్యాధులు నివారించబడతాయని చెప్పబడుతోంది.