సర్పయాగం జరిగింది ఇక్కడేనట !

పరీక్షిత్తు మహారాజు పాము కాటు కారణంగా మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన సర్ప జాతిపై జనమేజయ మహారాజు ఆగ్రహావేశాలతో రగిలిపోతాడు. సర్పజాతిని సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. సర్పజాతిపై గల పగను చల్లార్చుకోవడం కోసం, సర్పయాగాన్ని చేస్తాడు. మంత్ర ప్రభావం వలన అనేక సర్పజాతులు ఈ యాగానికి ఆహుతై పోతాయి. అలాంటి సర్పయాగం జరిగింది ఎక్కడో కాదు, మెదక్ జిల్లా పరిధిలోని 'ఏడుపాయల'లోనని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

మంజీరానది ఇక్కడ ఏడుపాయలుగా ప్రవైస్తూ వుంటుంది. 'ఏడుపాయల' అనేక విశేషాలకు ... మహిమలకు నెలవుగా భక్తులు భావిస్తుంటారు. ప్రశాంతంగా కనిపించే ఈ ప్రదేశం, శివరాత్రి సందర్భంగా జరిగే జాతరతో సందడిగా కనిపిస్తుంది. దేవతలు ... మహర్షులు ... మహారాజులు ... సర్పజాతులకు సంబంధించిన విశేషాలతో ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంటుంది. ఇక్కడి 'ఎల్లాపూర్' గ్రామ సమీపంలో గల 'మంజీరా నది' ఇసుక మేటలు తవ్వితే, ఇప్పటికీ అడుగు నుంచి బూడిద వంటి పదార్ధం బయటపడుతూ ఉంటుందట.

సర్పయాగానికి ఆహుతై పోయిన పాముల బూడిద ఇదేనని వాళ్లు చెబుతుంటారు. ఈ కారణంగానే జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని వాళ్లు బలంగా చెబుతుంటారు. ఇలా అనేక ప్రత్యేకతలను ... విశేషాలను తనలో కలుపుకుని ఇక్కడ ప్రవహించే ఏడుపాయలను దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News