స్వామివారికి పాదుకలు సమర్పించిన కృష్ణమ్మ

సాధారణంగా ఆయా క్షేత్రాల్లో కొలువుదీరిన దైవాలకు భక్తులు వివిధ కానుకలను సమర్పిస్తూ వుంటారు. భగవంతుడికి ఆ కానుకను సమర్పించి భక్తుడు ఎంతగా ఆనందిస్తూ ఉంటాడో, భక్తుడు ప్రేమతో ఇచ్చిన కానుకను స్వీకరించి భగవంతుడు అంతకన్నా ఎక్కువగా మురిసిపోతాడు.

అలా ఓ భక్తురాలు శ్రీనివాసుడికి ... అమ్మవారికి 'పాదరక్షలు' సమర్పించిందట. వాళ్లిద్దరూ ఆ పాదరక్షలు ధరించడమే కాకుండా, ఆ రోజుకి ప్రాధాన్యతను కల్పిస్తూ 'ఉద్దాల ఉత్సవం' జరిగేలా చేశారట. సాక్షాత్తు స్వామివారికీ ... అమ్మవారికి పాదరక్షలు సమర్పించిన ఆ భక్తురాలు ఎవరో కాదు, అనేక ప్రాంతాలను పవిత్రం చేస్తూ నదిగా ప్రవహించే కృష్ణమ్మే.

ఒకసారి అమ్మవారితో త కలిసి స్వామివారు ఇప్పటి ఆత్మకూరు సమీపంలో గల కృష్ణా తీరానికి చేరుకున్నాడట. ఆనందంతో ఆ దంపతులు నదిలో జలకాలాడిన అనంతరం, కృష్ణమ్మ తల్లి సంతోషంతో పొంగిపోతూ వారికి పాదరక్షలను సమర్పించిందట. స్వామివారు ... అమ్మవారు ఆ పాదరక్షలు ధరించి ప్రస్తుతం 'అమ్మపురం'గా పిలవబడుతోన్న గ్రామానికి సమీపంలో గల 'కాంచనగుహ'లో కొలువుదీరారు.

మహబూబ్ నగర్ జిల్లా 'అమ్మపురం' సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. కురుమూర్తి స్వామిగా ఇక్కడి శ్రీనివాసుడు పూజలు అందుకుంటూ వుంటాడు. ప్రతి సంవత్సరం 'కార్తీక శుక్ల సప్తమి' రోజున, అంటే ... లక్ష్మీశ్రీనివాసులకు కృష్ణమ్మ పాదరక్షలు ఇచ్చినట్టుగా చెప్పబడుతోన్న రోజున ఈ క్షేత్రంలో 'ఉద్దాల ఉత్సవం' నిర్వహిస్తూ వుంటారు.


More Bhakti News