స్వామి సేవలో తరిస్తోన్న గజరాజులు

సాధారణంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడ స్వామివారి వైభవానికి గుర్తుగా గజరాజులు కనిపిస్తూ వుంటాయి. నామాలను ధరించి భగవంతుడి సేవకు సిద్ధంగా ఉన్న గజరాజులను చూసినప్పుడు పవిత్రమైన భావం కలుగుతుంది. అనునిత్యం భగవంతుడి సేవలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్న ఆ గజరాజులు ఎంతటి అదృష్టం చేసుకున్నాయో అని అంతా అనుకుంటూ వుంటారు .. పూర్వజన్మ సుకృతమని చెప్పుకుంటూ వుంటారు.

మూడు నాలుగు ఏనుగులు కనిపిస్తేనే మురిసిపోయే భక్తులు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గజరాజులు కనిపిస్తే ఇక వాళ్ల ఆనందాశ్చర్యాలకు హద్దుండదు. వాళ్లని అంతటి ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రంగా 'గురువాయూర్' కనిపిస్తుంది. బాలకృష్ణుడు కొలువైన ఈ మహిమాన్విత క్షేత్రంలో, ఆయన వైభవాన్ని చాటుతూ పెద్ద సంఖ్యలో గజరాజులు కనిపిస్తుంటాయి. వివిధ సేవల్లో ఇవి 'మావటి' చెప్పినట్టుగా కాకుండా, మాధవుడు చెప్పినట్టుగా నడచుకుంటున్నట్టు కనిపిస్తుంటాయి.

గతంలో స్వామివారి సేవలో పాలుపంచుకున్న కొన్ని గజరాజులు, ఆయనతో ఎంతో అనుబంధాన్నీ ... అంకిత భావాన్ని కలిగి ఉండేవని అంటారు. ఈ జాబితాలో పద్మనాభన్ ... కేశవన్ అనే పేర్లు వినిపిస్తూ వుంటాయి. ఇవి ఎంతో శాంతంతో ... శ్రద్ధతో స్వామివారి సేవలో పాల్గొనేవని చెబుతుంటారు. పద్మనాభన్ చనిపోయినప్పుడు స్వామివారి మనసు కూడా కలత చెందినట్టుగా, విశిష్టమైనదిగా భావిస్తూ ఆయనకి నుదుటున ధరింపజేసే 'గంధం బొట్టు' రాలి పడిపోయిందట.

ఇక ఒక 'ఏకాదశి' రోజున స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా ఆయన వైపు తిరిగి కేశవన్ చనిపోయాడట. ఈ సంఘటనలను బట్టి స్వామి ఆ గజరాజులకు మోక్షాన్ని ప్రసాదించాడని చెబుతుంటారు. ఇక ఇక్కడి గజశాలలో కేశవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా అనిపిస్తుంది. స్వామివారికి అది చేసిన అసమానమైన సేవకు గాను దక్కిన అరుదైన గౌరవంగా కనిపిస్తుంది.


More Bhakti News