మోక్షం ఎలాంటివారికి లభిస్తుంది ?
వయసులో వుండగా సరదాగా ... విలాసంగా గడపాలనీ, పూజలు ... జపాలు అనేవి ముసలితనం వచ్చాక చేసేవని కొంతమంది అనుకోవడం మనం వింటూ వుంటాం. నిజానికి ఇది అలా అనుకునేవారి అమాయకత్వానికి ... అవగాహన లేని వాదనకు నిదర్శనమని చెప్పవచ్చు.
చాలామంది భవిష్యత్తులో తమకి అవసరమవుతుంది అనుకున్న ప్రతి చిన్న వస్తువును ముందుగానే సమకూర్చుకోవడం చేస్తుంటారు. అంత ముందుచూపు ఆధ్యాత్మిక విషయాలపై మాత్రం చూపరు. పూజ ... ధ్యానం ... జపం ... ఇలా ఏ విషయాన్ని గురించి ప్రస్తావించినా అందుకు తొందరేముందని అంటారు. అవన్నీ వృద్ధాప్యంలో చేయవలసినవంటూ, అందుకు చాలా సమయం వుందన్నట్టుగా వ్యవహరిస్తూ వుంటారు.
నిజానికి మరణమనేది ఏక్షణంలో ఏ వైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అది వచ్చినప్పుడు 'నారాయణ' అనే నాలుగు అక్షరాలను స్మరించే అవకాశం ఉండకపోవచ్చు. అలా జీవితంలో గానీ ... దాని చివరి సమయంలోగాని పరమాత్ముడిని స్మరించని వాళ్లు మోక్షానికి అనర్హులవుతారు. అలాంటి వాళ్లు పదే పదే ఈ జనన మరణ చక్రంలో పడి నానా యాతనలు అనుభవిస్తూనే వుంటారు.
అందువల్లనే ధర్మమార్గంలో జీవితాన్ని కొనసాగిస్తూ, నిరంతరం తన నామస్మరణం చేయామని 'భగవద్గీత'లో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవరైతే తనని విశ్వసిస్తూ జీవితాన్ని గడుపుతారో, అలాంటి వాళ్లు అవసాన దశలో తనని స్మరించకపోయినా మోక్షాన్ని ప్రసాదిస్తానని స్పష్టం చేశాడు. అందువలన భగవంతుడికి సేవచేసుకునే భాగ్యాన్ని వాయిదా వేసుకోకుండా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ పరమాత్ముడిని సేవిస్తూ ... స్మరిస్తూ వుండాలని గ్రహించాలి.