కాల పరీక్షకు నిలబడవలసిందే !
కాలం కలిసిరాకపోతే తాడు పామై కరుస్తుంది అంటారు. కాలం కలిసిరాకపోతే ఎంతటివారైనా ఏమీ చేయలేరు. సామాన్యులైనా ... మహారాజులైనా కాలపరీక్షకు నిలబడవలసిందే. ఎవరు ఎంతటి గొప్పవారనే విషయం కాలపరీక్షలో తేలిపోతుంది. అవసరాన్ని బట్టి ... అవకాశాన్నిబట్టి నీతిశాస్త్రాలు వల్లించిన వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో వాటిని పక్కన పెట్టి, కాలానికి తగినట్టుగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు.
కానీ తాను నమ్మిన సత్యానికీ ... ధర్మానికి కట్టుబడి కాలానికి ఎదురునిలిచిన వాళ్లలో హరిశ్చంద్రుడే ముందుగా కనిపిస్తాడు. కాలం ఎన్ని కష్టాలు పెట్టినా సత్యధర్మాలను విడవకుండా ఆయన ఆ పరిస్థితులను ఎదుర్కున్నాడు. విశ్వామిత్రుడికి చెల్లించవలసిన రుణం కోసం భార్యను దాసీగా అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు. మున్ముందు అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎదురైనా, సత్య ధర్మాలను వీడని మనోబలాన్ని తనకి ప్రసాదించవలసిందిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్ధిస్తాడు.
హరిశ్చంద్రుడు ఇచ్చిన సొమ్ముతో నక్షత్రకుడు అక్కడి నుంచి బయలుదేరుతూ, 'దారి బత్తెం' కూడా ఇవ్వవలసిందిగా హరిశ్చంద్రుడిని కోరతాడు. తనని బానిసగా అమ్మేసి వచ్చిన సొమ్ము తీసుకోమని అంటాడు హరిశ్చంద్రుడు. కాశీ నగరంలోని కూడలిలో హరిచంద్రుడిని అమ్మకానికి పెడతాడు నక్షత్రకుడు. అక్కడి స్మశాన వాటికకు పెద్దగా వ్యవహరిస్తోన్న 'వీరబాహుడు' ... హరిశ్చంద్రుడుని కొంటాడు. ఆయన పర్యవేక్షణలో ఉంటూ ... కాటికాపరిగా వ్యవహరించడానికి సిద్ధపడి హరిశ్చంద్రుడు అమ్ముడుపోతాడు. సత్య ధర్మాల పట్ల గల అంకితభావంతో ఆయన అందుకు సిద్ధపడటం, నక్షత్రకుడిని సైతం చలించిపోయేలా చేస్తుంది.