దుఃఖాన్ని దూరంచేసే వేంకటేశ్వరుడు

భగవంతుడు అందరివాడు ... ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ, ఇతరులపట్ల సేవా భావాన్ని కలిగివున్న వాళ్లను ఆయన కనిపెట్టుకునే వుంటాడు. అలాంటివాళ్లు కష్టాల్లో వున్నప్పుడు, ఆదుకునేది తాననే విషయం కూడా తెలియనీయకుండా కాపాడుతూ వుంటాడు. వివిధ రకాల ఆభరణాలను ధరించి గంభీరంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఆయన కళ్లు చల్లని వెన్నెల కురిపిస్తాయి ... మనసు వెన్నలా కరిగిపోతూ వుంటుంది.

ఈ కారణంగానే వేలనామాలు వున్న వేంకటేశ్వరుడిని భక్తులు కనులారా దర్శించుకుంటూ వుంటారు ... అనేక విధాలుగా ఆయనని కీర్తిస్తుంటారు. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న వేంకటేశ్వరస్వామి క్షేత్రాలలో ఒకటి 'సర్పవరం'లో కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతూ వుంటుంది.

ప్రసిద్ధి చెందిన భావనారాయణస్వామి ఆలయానికి దగ్గరలోనే ఈ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. భక్తుల సంకల్పం కారణంగా నిర్మించబడిన ఈ ఆలయంలో శ్రీదేవి - భూదేవి సమేతంగా వేంకటేశ్వరుడు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. స్వామివారి సౌందర్యం చూడగానే సమస్యలను మరిచిపోయి సంతోషపడిపోతూ వుండటం ఇక్కడ కనిపిస్తుంది.

ప్రశాంతమైన ప్రదేశంలో కుదురుగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతి శనివారమే కాకుండా, పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడి స్వామి దుఃఖాన్ని దూరం చేస్తాడనీ, సకల శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. చైత్రమాసంలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవంలో పెద్దసంఖ్యలో పాల్గొంటూ, కృతజ్ఞతా పూర్వకంగా కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.


More Bhakti News