దేవుడిని నమ్మి చెడిన వాళ్లు లేరు

దేవుడిపైన పరిపూర్ణమైన విశ్వాసం వుండాలి ... పరీక్షలు ఎక్కువవుతున్నా కొద్దీ ఆ విశ్వాసం బలపడుతూనే వుండాలి తప్ప, ఎలాంటి పరిస్థితుల్లోను అది సడలకూడదు. బలమైన ఆ విశ్వాసం కారణంగానే ధృవుడు ... శ్రీమహావిష్ణువు తొడపై కూర్చోగలిగాడు. ప్రహ్లాదుడు .. తన తండ్రి ఇచ్చిన విషాన్ని తాగగలిగాడు. మార్కండేయుడు .. శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని ఉండిపోయాడు.

ఇలా భగవంతుడి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్లు ఎవరూ కూడా నిరాశచెందిన దాఖలాలు లేవు. అలాంటి భక్తులందరినీ అనుగ్రహించడమే కాకుండా, వాళ్ల కీర్తిప్రతిష్ఠలు ఆ చంద్రతారార్కం వెలుగొందేలా చేశాడు. ఇలాంటి నిదర్శనమే మనకి భక్త తుకారాం విషయంలోనూ కనిపిస్తుంది .

సమస్తమైన ప్రకృతిలో ప్రతిదానిలోను తుకారాం ఆ పాండురంగస్వామిని దర్శించాడు. ఆ స్వామిని స్మరించడం ... సేవించడం ... కీర్తించడం మినహా ఆయనకి మరో ధ్యాస లేదు. ఆయనలోని భక్తుడిని అక్కడి ప్రజలు గౌరవించడాన్ని కొంతమంది స్వార్ధపరులు సహించలేకపోతారు. ఎంతోకాలంగా స్వామివారిపై తుకారాం రాస్తూ వస్తోన్న అభంగాలను ఆయన చేతులతోనే ఇంద్రాణి నదిలో వదిలేసేలా చేస్తారు.

అయితే అలా నదిలో అభంగాలను వదిలేసినా తుకారాం నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లలేదు. తన స్వామి తన రచనలను తనకి తిరిగి చేరుస్తాడనే అపారమైన విశ్వాసంతో ఆ నదీ ఒడ్డునే 13 రోజులపాటు కూర్చున్నాడు. భార్యా బిడ్డలు ... ఊళ్లోని ఆత్మీయులు ఎంతగా బతిమాలినా ఆయన ఆహారం తీసుకోలేదు. అలా ఈ పదమూడు రోజులు కూడా ఆయన పాండురంగ స్వామిని కీర్తిస్తూనే వున్నాడు. తన పట్ల ఆయనకి గల విశ్వాసం ఆ పాండురంగడినే ఆశ్చర్యపరిచింది.

దాంతో ఆయన ఆ నదిలో మునిగిపోయిన అభంగాలన్నీ కూడా నీటిపైకి తేలి ... తుకారాం వైపుకు వచ్చేలా చేస్తాడు. పాండురంగడు కరుణించాడు అనుకుంటూ ఆయన గురించి తుకారాం పరవశిస్తూ పాడటం మొదలుపెడతాడు. భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసమే వుంటే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని తుకారాం లోకానికి మరోమారు చాటిచెప్పాడు.


More Bhakti News