దేవుడి ఎదుట లెంపలు వేసుకుంటే ?
ఆలయంలోకి అడుగుపెట్టగానే అక్కడి ప్రశాంతత ... పవిత్రత మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్టుగా అనిపించి, ఉత్సాహంగా ప్రదక్షిణలు చేయడం జరుగుతూ వుంటుంది. భగవంతుడిని చూడగానే భక్తి శ్రద్ధలతో ఆయనకి నమస్కరిస్తూ, లెంపలు వేసుకోవడం జరుగుతుంటుంది. దేవుడి ఎదురుగా నిలబడి లెంపలు వేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు.
ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో తెలియక తప్పులు చేయడం జరుగుతూ వుంటుంది. అలా అనుకోకుండా తప్పు జరిగిపోతే మన్నించమని కోరుతూ, భగవంతుడి సన్నిధిలో చెంపలు వేసుకోవడం చేస్తుంటారు. ఇక మీదట తాను అలా తప్పులు చేయననీ, వాటి దోషాలు తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపకుండా కాపాడమని కోరుతుంటారు.
ఈ నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగా తప్పు చేసిన వాళ్లు సైతం వచ్చి, తాము ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి తప్పు చేయవలసిందో భగవంతుడికి చెప్పుకుంటారు. ఆ తప్పు వలన ఇతరులకు నష్టం వాటిల్లడం ... వాళ్లు బాధపడటం జరిగిందని అంటారు. ఆ తప్పు వలన వెతుక్కుంటూ రానున్న దోషం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, మరోమారు అలా చేయనని చెప్పి చెంపలు వేసుకోవడం చేస్తుంటారు.
సాధారణంగా చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడితే, ఎదుటివాళ్ళే క్షమించి వదిలేస్తుంటారు. ఇక భగవంతుడు దయా సముద్రుడు కావడం వలన ఆయన కూడా అదే పని చేస్తాడు. అయితే తప్పు చేసి ... అది తప్పని తెలుసుకుని దానిని దిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడు భగవంతుడు క్షమిస్తాడు. మరోమారు ఆ తప్పును చేయనని చెప్పడం వలన మన్నిస్తాడు. అయితే గుడిలో నుంచి బయటికి రాగానే, తాను భగవంతుడిని వేడుకున్న విషయాన్ని మరిచిపోయి, అదే తప్పును చేస్తే అంతకు మించిన పెద్ద తప్పు మరొకటి వుండదు.
మళ్లీ గుడికి వెళ్లి లెంపలు వేసుకోవచ్చనుకుంటే అది అవివేకమే అవుతుంది. మళ్లీ .. మళ్లీ తప్పులు చేస్తూ భగవంతుడు పదే పదే క్షమిస్తాడనుకోవడం అమాయకత్వమవుతుంది. ఆయన సహనాన్ని పరీక్షించి ఇబ్బందులు కొనితెచ్చుకోవడమే అవుతుంది. అందుకే భగవంతుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి వుండాలి. ఆయన అనుగ్రహం అత్యంత అరుదైనదిగా భావించాలి. అనుగ్రహించడం ఆయన బలహీనత కాదనే విషయాన్ని గ్రహించాలి.