అది అమ్మవారి మహిమేనంటారు !

సాధారణంగా ఏ గ్రామంలో కూడా తాము ఇలవేల్పుగా భావిస్తోన్న దైవాన్ని నిర్లక్ష్యం చేయడం జరగదు. అలాచేస్తే దైవం కోపిస్తుందనీ .. ఫలితంగా అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన నష్టాలు ఎదురవుతాయని నమ్ముతుంటారు. అందువల్లనే దైవానికి చేయవలసిన సేవల్లోను ... జరిపించవలసిన వేడుకల్లోను ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూ వుంటారు. అమ్మవారి నిత్యపూజలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

'సత్యమాంబ' కొలువైన 'కంభం' క్షేత్రాన్ని గురించి వింటే, గ్రామస్తులు తమ ఇలవేల్పు విషయంలో ఎందుకు అంత జాగ్రత్తగా వుంటారనే విషయం అర్థమవుతుంది. ప్రకాశం జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. చాళుక్యుల కాలంలో వైభవంగా వెలుగొందిన ఈ క్షేత్రం, ఆ తరువాత కూడా చాలాకాలం పాటు తన ప్రత్యేకతను చాటుకుంది.

కాలక్రమంలో చోటుచేసుకున్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అమ్మవారికి ఆదరణ కరువైందట. అలాంటి పరిస్థితుల్లోనే ఈ ప్రాంతాన్ని అంతుచిక్కని వ్యాధులు అలుముకున్నాయట. మనుషులు .. పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతూ ఉండటంతో, అంతా తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. అందరినీ కాపాడే అమ్మవారికి పూజాభిషేకాలు జరగకపోవడం వల్లనే ఇలా ప్రాణనష్టం జరుగుతోందని భావించారు.

వెంటనే అమ్మవారికి ధూప .. దీప .. నైవేద్యాలను ఆరంభించి, తమ వలన జరిగిన తప్పును మన్నించమని కోరారు. అంతే అప్పటి వరకూ వేగంగా విస్తరించిన అంటువ్యాధులు అక్కడితో ఆగిపోయాయట. ఈ సంఘటనతో అమ్మవారి మహిమ మరోమారు వెలుగులోకి వచ్చింది. ఆనాటి నుంచి అమ్మవారిని పూజిస్తూ ... సేవిస్తూ ... ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతోన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.


More Bhakti News