చెడు చేయబోయినా మంచే జరుగుతుంది !

ప్రశాంతమైన .. పవిత్రమైన ... నిరాడంబరమైన ... నిస్వార్థ పూరితమైన జీవితాన్ని కొనసాగిస్తోన్న భగవంతుడి సేవకులకు ఎవరూ చెడు చేయలేరు. ఒకవేళ అలాంటి వాళ్లకి చెడు చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా .. మంచే జరుగుతుంది. కృష్ణ భక్తుడైన జయదేవుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ వుంటుంది.

ఒక దుర్మార్గుడు జయదేవుడి దంపతులను వేరుచేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడసాగాడు. అలాంటి పరిస్థితుల్లోనే పొరుగూరు వెళ్లిన జయదేవుడు అక్కడి పని చూసుకుని తిరిగి తన ఊరుకి బయలుదేరతాడు. మార్గమధ్యంలో ఆ దుర్మార్గుడు జయదేవుడిపై హఠాత్తుగా దాడిచేసి పారిపోతాడు. తీవ్రంగా గాయపడిన జయదేవుడు స్పృహ కోల్పోతాడు.

అదే సమయంలో ఆ మార్గంలో వస్తోన్న నవద్వీప మహారాజు లక్ష్మణసేనుడు ఆయనని చూసి, తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. అక్కడ ఏర్పాటు చేయబడిన ప్రత్యేక మందిరంలో జయదేవుడు కోలుకుంటాడు. ఆయన మధురకవి జయదేవుడని తెలుసుకున్న మహారాజు ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తాడు. జయదేవుడు 'గీతాగోవిందం' పేరుతో కావ్యాన్ని రాస్తున్నాడని తెలిసి అభినందిస్తాడు. ఇక మీదట తన ఆస్థానంలో ఉండవలసిందేనంటూ పట్టుబడతాడు.

మహారాజు చూపిన ఆదరాభిమానాల కారణంగా ఆయన మాటను జయదేవుడు కాదనలేకపోతాడు. ఆయన అనుమతి తీసుకుని పద్మావతిదేవిని కూడా అక్కడికి రప్పిస్తాడు మహారాజు. అలా ఓ దుర్మార్గుడు ఆ దంపతులను విడదీయాలని చూస్తే, ఆ ప్రయత్నం కారణంగా వారి బంధం మరింత ధృఢపడింది. సామాన్య్లులు అడుగుపెట్టలేనిచోట వాళ్లకి ఆశ్రయం లభించింది. జయదేవుడు తలపెట్టిన 'గీత గోవిందం' రచన ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి అక్కడి వాతావరణం అన్ని విధాలుగా సహకరించింది.

ఇలా ఇన్ని విధాలుగా జయదేవుడిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది ఆ కృష్ణ భగవానుడేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడిని ప్రేమించే వాళ్లకి ... ఆయనని సేవించే వాళ్లకి ఎవరూ ఎలాంటి హాని చేయలేరు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


More Bhakti News