కష్టాలను తొలగించే దత్తాత్రేయుడు

త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయుడు మహాశక్తిమంతుడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన అవతారం శాశ్వతమైనదని స్పష్టం చేస్తున్నాయి. అలాంటి దత్తాత్రేయుడు ప్రతిరోజు అనేక రూపాలను ధరిస్తూ ... భక్తులను పరీక్షిస్తూ ఉంటాడు. ఏడుసార్లు దత్తాత్రేయుడిని పిలిస్తే, ఏడోసారి పిలుపికి ఆయన భక్తుల చెంత ఉంటాడని చెప్పబడుతోంది.

దత్తాత్రేయుడు అంత వేగంగా వచ్చి, ఆపదలో ఉన్నవారిని కాపాడతాడు. తన భక్తులకు జ్ఞాన సంపదను ప్రసాదిస్తూ, వాళ్లని ధర్మమార్గంలో నడిపిస్తూ వుంటాడు. ఇక దత్తాత్రేయస్వామి అర్థాంగి అయిన అనఘాదేవి మహిమ మాటల్లో చెప్పలేనిది. ఎలాంటి కష్టాలైనా ఆ తల్లిని తలచుకున్నంత మాత్రాన్నే తొలగిపోతాయని అంటారు.

సాధారణంగా దత్తాత్రేయస్వామి - అనఘాదేవి కొలువైన క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిధిలో గల 'దొండపాడు'లో దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయంలో దత్తాత్రేయస్వామి ... అనఘాదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటారు. ప్రతి గురువారం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఏక్కువగా వుంటుంది.

ఈ స్వామి ఒక్క రోజులోనే అనేక రూపాలను ధరిస్తూ, మనుషులలో గల మానవత్వాన్ని ... దయా గుణాన్ని ... భక్తి విశ్వాసాలను పరీక్షిస్తూ ఉంటాడు. అందువలన ఎవరు ఎలా వున్నా అవహేళన చేయకూడదు. ఎలాంటివారైనా సాయాన్ని కోరివస్తే కాదనకుండా చేతనైనంత సాయం చేయాలి. భూతదయను కలిగివుండి నీతి నియమాలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూ తనని ఆరాధించిన వారికి ఆ క్షణంలోనే ఆయన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ వుంటాడు.

ఇక అనునిత్యం తన నామస్మరణ చేస్తోన్న వారిని ఆయన వెన్నంటే ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. కార్యసిద్ధి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News