వేంకటేశ్వరుడిని వేడుకుంటే చాలట !
సౌందర్యమంటే శ్రీనివాసుడిదే ... సంపదంటే శ్రీనివాసుడిదే ... సూర్యభగవానుడితో సమానమైన తేజస్సు ఆయనదే అన్నట్టుగా ఆ స్వామి కనిపిస్తుంటాడు. గర్భాలయం నిండుగా కళకళలాడుతూ ఆయన దర్శనమిస్తూ వుంటే, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లు సైతం ఆ విషయాన్ని మరిచిపోయి అలాగే చూస్తుండిపోతారు.
అలా సమ్మోహన రూపంతో భక్తుల హృదయాలను దోచుకుంటూ స్వామివారు అనేక ఆలయాల్లో కొలువై కనిపిస్తుంటాడు. నిత్యకళ్యాణం ... పచ్చతోరణం అనే మాటను నిజం చేస్తుంటాడు. అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటి మనకి 'మిర్యాలగూడెం'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో అలమేలుమంగ - పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి కొలువుదీరి కనిపిస్తుంటాడు.
గర్భాలయంలో గల మూలమూర్తి నిలువెత్తు రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు కొలువై పూజలందుకుంటూ వుంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఓ వైపున హనుమంతుడు ... నాగేంద్రుడు దర్శనమిస్తూ వుంటారు. మరోవైపున యాగశాల ... కల్యాణ మంటపం కనిపిస్తుంటాయి.
సామూహిక లక్ష్మీ పూజలు ... ధనుర్మాస ప్రత్యేక పూజలు ... వార్షిక బ్రమ్మోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి శనివారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఎవరు ఎలాంటి కష్టాల్లో వున్నా ఈ వేంకటేశ్వరుడిని వేడుకుంటే చాలట. అనతికాలంలోనే అవన్నీ తొలగిపోతాయనీ, ఆనందకరమైన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.