అదే పురందరదాసు గొప్పతనం !
పాండురంగస్వామి లీలా విశేషాలను గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్న పురందరదాసు, భగవంతుడిని సేవించడమే జీవితానికి పరమార్థమని తెలుసుకుంటాడు. తన సిరిసంపదలను పేదవారికి పంచి, భార్యాబిడ్డలతో కలిసి అనేక క్షేత్రాలను దర్శిస్తాడు. పాండురంగస్వామిపై అనేక కృతులను రచిస్తూ ... ఆలపిస్తూ ప్రజల్లో భక్తిభావాలను పెంపొందింపజేస్తుంటాడు.
అలా ఆయన పండరీపురం చేరుకొని ఆ స్వామిని ఆరాధిస్తూ తరిస్తుంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజున ఒక వృద్ధుడు స్వామివారిని చూడాలని ఆరాటపడుతూ ఉండటాన్ని పురందరదాసు గమనిస్తాడు. తనకి ఆలయంలోకి వచ్చే అర్హత లేదంటూ ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ వుంటే, ఆయన్ని వెంటబెట్టుకుని లోపలికి తీసుకువచ్చి భగవంతుడి దర్శనం చేయిస్తాడు.
అయితే తన జన్మ తరించిందనుకున్న ఆ వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతాడు. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనకి అందరూ నివ్వెరపోతారు. పురందరదాసు చేసిన పనివల్లనే ఆలయం అపవిత్రమైపోయిందని అక్కడి వాళ్లు అసహనాన్ని ప్రదర్శిస్తారు. చనిపోయిన వ్యక్తిని గురించి కూడా తక్కువగా మాట్లాడతారు. ధనిక ... పేద ... ఘనులు ... హీనులు అనే తేడ భగవంతుడు చూపడనీ, ఆయన దృష్టిలో అంతా సమానులేనని చెబుతాడు పురందరదాసు.
పంచభూతాలకు లేని పట్టింపులు మానవమాత్రులకు ఎందుకంటూ అడుగుతాడు. పండిన ఆకు ఏ క్షణంలోనైనా రాలిపోవచ్చనీ, అలాగే మనిషి ఎక్కడ ఎలాంటి స్థితిలో వున్నా ఆయువు తీరితే రాలిపోతాడని అంటాడు. ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే అది ఆయన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తాడు. భగవంతుడు కొందరివాడు కాదనీ, ఆయనని చూడాలనుకున్న నిస్సహాయులకు సాయంచేస్తే అది అపరాధం ఎలా అవుతుందంటూ నిలదీస్తాడు ?
భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకోకుండా అహంకారించడం మంచిదికాదని అంటాడు. మనిషిని మనిషిగా చూడని వాళ్ల పూజలను భగవంతుడు స్వీకరించడని చెబుతాడు. ఆలయంలో పడిపోయిన వ్యక్తిని బయటికి తీసుకువెళ్లడానికి ఎవరూ సాయం రాకపోవడంతో అక్కడి వారి అమాయకత్వానికి పురందరదాసు నవ్వుకుంటాడు. వాళ్లకి జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరుతూ, ఎవరి సాయం లేకుండా తానే ఆ పనిని పూర్తి చేస్తాడు.