పాపాలను నశింపజేసే యోగిని ఏకాదశి
'చేసుకున్నవారికి చేసుకున్నంత' అనే మాట ఆయా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అంటే ఎవరు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాళ్లు తగిన ఫలితాలను అనుభవిస్తారని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడలేక పోతుంటారు. మరికొందరు అప్పుల నుంచి ... అపజయాల నుంచి బయటపడలేకపోతుంటారు. తాము నీతి నియమాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, భగవంతుడు ఎందుకు ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నాడని వాళ్లు అనుకుంటూ వుంటారు.
వాళ్లందరూ కూడా ప్రస్తుతం తాము ఎదుర్కుంటోన్న పరిస్థితులు, గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా భావించవలసి వుంటుంది. ఆ జన్మలలో చేసిన పాపాలు ... అందువలన బాధకి గురైన వాళ్లు పెట్టిన శాపాల కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రహించాలి. మరి జన్మజన్మలుగా వెంటాడుతోన్న ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా? అని చాలామంది ఆవేదనకి లోనవుతుంటారు.
అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా 'యోగిని ఏకాదశి' చెప్పబడుతోంది. 'ఆషాఢ బహుళ ఏకాదశి' ని యోగిని ఏకాదశిగా చెబుతుంటారు. ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు .. శాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని అంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ... ధర్మరాజుతో ఈ విషయాన్ని చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.