భగవంతుడు ఏం కోరుకుంటాడు ?
కోరికలకు ఆరంభమే తప్ప అంతం ఉండదు ... ఒకదాని తరువాత ఒకటిగా అవి పుట్టుకొస్తూనే వుంటాయి. ప్రతి కోరిక ముఖ్యమైనదిగానే కనిపిస్తుంది .. అది నెరవేరకపోతే ఇక బతకడమే దండుగ అనిపిస్తూ వుంటుంది. అంతబలంగా కోరికలు మనిషిని నడిపిస్తూ వుంటాయి .. క్షణక్షణానికి ఉధృతమవుతూ పరుగులు తీయిస్తుంటాయి.
ప్రతి ఒక్కరూ కోరికలు నెరవేర్చుకోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. తమవలన కావడంలేదని అనుకున్నప్పుడు, ఆ కోరికను నెరవేర్చే భారాన్ని భగవంతుడిపై వేస్తుంటారు. తమ కోరికను నెరవేర్చమని పదేపదే భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. సాధ్యమైనంత త్వరగా ఆ పని చేసి పెట్టమంటూ మొక్కుకుంటూ వుంటారు. జగాలనేలే స్వామికి ... సకల జీవులకు ఆహారాన్ని అందిస్తోన్న స్వామికి తామిచ్చే కానుక ఏపాటిదని మాత్రం ఆలోచనచేయరు.
ఇలా కొంతమంది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసమే భగవంతుడిని ఆశ్రయిస్తుంటారు. మరికొందరు భక్తులు ఆపదలో వున్నప్పుడు మాత్రమే ఆ దైవం సాయాన్ని అర్దిస్తుంటారు. తమని ఆపద నుంచి గట్తెక్కించిన కృతజ్ఞతతో అనునిత్యం ఆ స్వామిని సేవించడం ఆరంభిస్తారు. ఇలాంటి భక్తులకు భగవంతుడు తన సహాయ సహకారాలను అందిస్తాడు. అయితే ఆయన కోరుకునేది మాత్రం అనేక కోరికలతో సతమతమైపోతోన్న భక్తులను కాదు. తమ కోరికలను నెరవేర్చుకోవడం కోసం తనపై ప్రేమానురాగాలను కురిపించే భక్తులను కాదు.
తన పాద స్పర్శచే పరవశించేపోయే భక్తులను .. తన నామస్మరణచే మైమరచిపోయే భక్తులను .. తన సన్నిధిలో ఉండటం కోసం తపించిపోయే భక్తులను .. తాను తప్ప మరేదీ అవసరంలేని భక్తులను మాత్రమే ఆయన కోరుకుంటాడు. అలాంటి భక్తుల కోసమే ఆయన నిరీక్షిస్తుంటాడు, వాళ్ల సేవలను మాత్రమే ఆశిస్తుంటాడు. నిష్కామంతో .. నిస్వార్ధంతో వాళ్లు చేసే సేవలనే ఆయన స్వీకరిస్తాడు ... సంతోషిస్తాడు.