వివాహాలు జరిపించే లక్ష్మీనారాయణులు !
సాధారణంగా చదువు పూర్తయిన తరువాత అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటూ వుంటారు. అలాగే అబ్బాయికి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేయడమే అన్ని విధాలా మంచిదనే నిర్ణయానికి వస్తుంటారు. అనుకున్నట్టుగానే అమ్మాయి చదువు పూర్తవుతుంది ... అబ్బాయికి ఉద్యోగమూ వస్తుంది.
ఇక అప్పటి నుంచి ఏ సంబంధం చూసినా ఏదో ఒక కారణం చేత అది తప్పిపోతూ ఉండటంతో తల్లిదండ్రులలో ఆందోళన మొదలవుతుంది. ఇక జాతక దోషాలు చూపించడానికీ ... అందుకు సంబంధించిన శాంతులు చేయించడానికి సిద్ధపడిపోతుంటారు. వివాహం విషయంలో గల ఆటంకాలు తొలగిపోవడం కోసం ఏ క్షేత్రానికి వెళితే బాగుంటుందని తెలిసిన వాళ్లని ఆరాతీస్తుంటారు.
అలాంటివారికి ఎక్కువగా వినిపించే క్షేత్రం 'వేపంజేరి' అని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని నారాయణుడు దర్శనమిస్తూ ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. లక్ష్మీనారాయణులు ఈ విధంగా కొలువై వుండటం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వివిధ కారణాల వలన వివాహం ఆలస్యమవుతున్న వాళ్లు, ఇక్కడి లక్ష్మీనారాయణుడిని 41 రోజులు అంకితభావంతో అర్చించవలసి వుంటుంది.
ఈ విధంగా చేయడం వలన వివాహానికి అడ్డుపడుతోన్న దోషాలు నశించి, అనతికాలంలోనే వాళ్లకి వివాహం జరుగుతుందని చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించి ... స్వామివారిని సేవించి పెళ్లి పీటలపై కూర్చున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వివాహాలు జరిపించే దేవుడిగా ప్రసిద్ధి చెందడం వల్లనే ఇక్కడి స్వామిని 'కళ్యాణ లక్ష్మీనారాయణుడు' అని ప్రేమతో పిలుస్తుంటారు.