లక్ష్మణుడి మనసు తెలిసిన రాముడు

తండ్రి మాట మేరకు శ్రీరాముడు .. సీతను వెంటబెట్టుకుని వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. కుటుంబ సభ్యులతో పాటు అయోధ్య వాసులంతా కన్నీళ్ల పర్యంతమవుతూ వుంటారు. రాముడు లేని రాజ్యంలో తాము వుండమంటూ ఆయనతో పాటు బయలిదేరేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ వుంటుంది.

ఇక సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి బయలుదేరాలనుకున్న రాముడు, లక్ష్మణుడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు. తాను దూరమైతే తన తల్లి తట్టుకోలేదనీ, ఆమెని ఓదార్చవలసిన బాధ్యత అతనిదేనని చెబుతాడు. తనని అతనిలోనే చూసుకుంటూ వుండటం వలన కౌసల్యాదేవికి కాస్త ఉపశమనంగా ఉంటుందని అంటాడు.

ఆ మాటలకి లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, కౌసల్యాదేవితో ఆయన మాట్లాడిన మాటలను గుర్తుచేస్తాడు. భరత శత్రుఘ్నులను జాగ్రత్తగా చూసుకోమని కౌసల్యతో చెప్పావేగానీ, అక్కడ తన పేరును ప్రస్తావించలేదంటే తాను అయోధ్యలో వుండటం లేదనే కదా అర్థమని అంటాడు. అయోధ్యలో ఉండటం లేదంటే, ఆయనతో పాటు తాను కూడా అడవులకు వస్తున్నట్టే కదా అని అంటాడు.

లక్ష్మణుడు అలా అమాయకంగా అడగడంతో రాముడు నవ్వుకుంటాడు. అయోధ్య వాసులందరినీ తనతో రాకుండా ఆపవచ్చును గానీ, లక్ష్మణుడిని ఆపడం సాధ్యం కాదనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. తనకి దూరంగా లక్ష్మణుడు ఒక్కరోజు కూడా ఉండలేడని గ్రహించిన రాముడు, తనతో రావడానికి అంగీకరిస్తాడు. దాంతో ఆనందంగా ఆయన సీతారాములను అనుసరిస్తాడు.


More Bhakti News