శివకేశవుల మధ్య అనుబంధం అలాంటిది !

పరమశివుడు లయ కారకుడు ... శ్రీమహావిష్ణువు స్థితి కారకుడు. ఒకరుండేది కైలాసంలో ... మరొకరు వుండేది వైకుంఠంలో. అయినా వాళ్లిద్దరి మధ్య గల అనుబంధం అపురూపమైనదిగా ... అద్భుతమైనదిగా కనిపిస్తూ వుంటుంది. కలిసికట్టుగా లోకాలను నడిపిస్తోన్న తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది. లోక కల్యాణానికి సంబంధించిన విషయాల్లో వాళ్లిద్దరూ ఒకరికొకరు సహకరించుకున్న తీరు ఆలోచింపజేస్తుంది.

అలాంటి శివకేశవులకి భేదం లేదని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో శివకేశవులు వ్యవహరించిన తీరు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీమహావిష్ణువు కొలువైన క్షేత్రాలకి శివుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. ఇక ఆదిదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలకి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ కనిపిస్తుంటాడు.

ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా పంచారామాలను చెప్పుకోవచ్చు. ద్రాక్షారామం .. క్షీరారామం .. కుమారారామం .. సోమారామం .. అమరారామం పంచారామ క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. ద్రాక్షారామంలో భీమేశ్వరుడుగా .. క్షీరారామంలో క్షీర రామలింగేశ్వరుడుగా .. కుమారారామంలో సోమేశ్వరుడుగా .. సోమారామంలో సోమేశ్వర జనార్ధనుడుగా .. అమరారామంలో అమరలింగేశ్వరస్వామిగా శివుడు పూజలు అందుకుంటూ వుంటాడు. అయితే ఈ పంచారామాలకి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా వుండటం వాళ్ల అనుబంధానికీ ... ఆత్మీయతకి అద్దంపడుతూ వుంటుంది.

ద్రాక్షారామానికి 'లక్ష్మీనారాయణుడు' .. అమరారామానికి 'వేణుగోపాలస్వామి' .. ఇక క్షీరారామానికి .. సోమారామానికి .. కుమారారామానికి 'జనార్ధనుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. ఇలా ఒకే క్షేత్రంలో శివకేశవులు పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంటారు. అత్యంత శక్తిమంతమైన ఈ క్షేత్రాలను దర్శిస్తే, శివకేశవుల మధ్యగల అనుబంధం ఎలాంటిదో అర్థమవుతుంది. హరిహరుల మధ్య భేదం లేదనీ, వాళ్లిద్దరూ ఒకటేననే విషయం బోధపడుతుంది.


More Bhakti News