విఘ్నాలు తొలగించే వినాయకుడు
ఇటు దైవ కార్యాలలోను ... అటు శుభకార్యాలలోను వినాయకుడు తొలి పూజను అందుకోవడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. వినాయకుడికి నమస్కరిస్తే చాలు ... తలపెట్టిన కార్యాలు ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే గణపతికి సంబంధించిన ఆలయాలు ఎప్పుడు చూసినా సందడిగా కనిపిస్తూ వుంటాయి.
ఇక ప్రధాన దైవంగా ఆవిర్భవించి భక్తులను భారీగా అనుగ్రహించే వినాయకుడు, వివిధ ఆలయాలలో సైతం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాడు. శివాలయాలలోనే కాదు వైష్ణవ ఆలయాలలోను వినాయకుడు కొలువై భక్తులకు దర్శమిస్తూ వుండటం ఆయన విశిష్టతకు అద్దంపడుతూ వుంటుంది. అలా వినాయకుడు ప్రధానదైవమైన భావనారాయణ క్షేత్రంలో దర్శనమిస్తూ వుండటం మనకి 'సర్పవరం'లో కనిపిస్తుంది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి ... సామర్లకోటకి మధ్యలో భావనారాయణస్వామి క్షేత్రం విలసిల్లుతోంది. పంచ భావనారాయణ స్వామి క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. అలాంటి ఈ ప్రాచీన క్షేత్రంలో మొదటి ప్రాకారంలోకి అడుగుపెట్టిన తరువాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం వుంటుంది. ఆ ప్రదక్షిణ మార్గంలో .. ప్రాకార గణపతి దర్శనమిస్తూ వుంటాడు.
ప్రదక్షిణ క్రమంలో బయలుదేరిన భక్తులు ముందుగా ఇక్కడి గణపతికి నమస్కరించుకుని, ఆ తరువాతే ప్రధాన ప్రాకారాన్ని దాటుకుని లోపలికి వెళతారు. దేవతలచే నిర్మించబడినట్టుగా చెబుతోన్న ఈ ఆలయంలో, ఈ వినాయకుడి ప్రతిమను చూస్తే ... ప్రాచీనకాలంలో మలచబడినదిగా అనిపిస్తూ వుంటుంది. ఇక్కడి వినాయకుడి ఆశీస్సులు తీసుకుని ఏ కార్యాన్ని ఆరంభించినా విజయం సిద్ధిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.