శివపూజలో ఏ పూలు వాడకూడదు ?
ఆదిదేవుడి లీలా విశేషాలను పరిశీలిస్తే, తన భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన ఎంతగా ఆరాటపడతాడో అర్థమవుతుంది. తల్లిలా ఆతృతపడుతూ రావడం ... తండ్రిలా కోరినవి అందించడం ఆయన విషయంలోనే కనిపిస్తుంది. పిలిచినదే తడవుగా పలుకుతాడు కనుకనే దేవతలు మొదలు సామాన్య మానవుల వరకూ అంతా ఆయనను ఆరాధిస్తుంటారు.
అలాంటి శివుడు అభిషేక ప్రియుడు కనుక ఆయనని అభిషేకించి, ఫలం .. పుష్పం సమర్పించి సంతృప్తి చెందుతుంటారు. ఒక్కోరకం శివలింగాన్ని పూజించడం వలన ... ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకించడం వలన అందుకు తగినట్టుగా పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పరమశివుడి పూజకు ఉపయోగించే వివిధ రకాల పూలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయనీ, అయితే 'సంపెంగలు' మాత్రం సదాశివుడి పూజలో వాడకూడదని చెప్పబడుతోంది. పరమశివుడికి సమర్పించే పూలలో 'నల్లకలువలు' అత్యుత్తమమైనవనీ, ఈశ్వరుడికి ఈ పూలను సమర్పించడం వలన, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.