పశ్చాత్తాపమే పాపాన్ని దూరం చేస్తుంది !
అంబరీషుడు తన భార్య కల్యాణితో కలిసి అడవిలో ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటాడు. రాజ్యభోగాలకు దూరమైనందుకు ఆయన ఎంతమాత్రం బాధపడలేదు. శ్రీమన్నారాయణుడిని ప్రశాంతంగా ధ్యానించుకోవచ్చని ఆనందపడతాడు. భగవంతుడి ఆరాధనలో ఆయనకి అవసరమైనవి సమకూరుస్తూ ... సేవిస్తూ కల్యాణి కూడా తరిస్తూ వుంటుంది.
అలాంటి పరిస్థితుల్లోనే దూర్వాసుడి మాట కాదనలేక, మారువేషంలో అంబరీషుడి ఆశ్రమానికి వచ్చిన ఇంద్రుడు, ఆయన నుంచి భక్తి ధర్మాలను దానంగా పొందుతాడు. వచ్చినది ఎవరో తెలుసుకోకుండా అంబరీషుడు ముందుగానే మాట ఇచ్చిన కారణంగా, ఆయనకి కల్యాణి అడ్డుచెప్పలేకపోతుంది. భక్తి ధర్మాలను దానంగా ఇచ్చిన కారణంగా, అంబరీషుడి ప్రవర్తనలో వెంటనే మార్పు వస్తుంది.
భర్త ధోరణిలో వచ్చిన మార్పు కల్యాణికి ఎంతో బాధకలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెపై వ్యామోహంతో ఇంద్రుడు మరోమారు మారువేషంలో ఆ ఆశ్రమంలో అడుగుపెడతాడు. తన పాతివ్రత్య మహిమచే అసలు విషయాన్ని గ్రహించిన కల్యాణి, ఇంద్రుడికి తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అవమానభారంతో వెనుదిరిగిన ఇంద్రుడు ఆలోచనలో పడతాడు. మహాభక్తుడైన అంబరీషుడు ... పరమ సాధ్వీమణి అయిన కల్యాణి విషయంలో జోక్యం చేసుకోవడం వలన తాను పెద్ద పాపమే చేశానని గ్రహిస్తాడు.
ఆ పాపం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తుండటంతో, ఆ దంపతులను కలుసుకుంటాడు. జరిగినదానికి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. కపటంతో అంబరీషుడి నుంచి గ్రహించిన భక్తి ధర్మాలను ఆయనకీ తిరిగిచ్చేస్తాడు. దాంతో అంబరీషుడు ఎప్పటిలానే శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ ... సేవిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తాడు. పతిసేవాయే పరమార్థంగా భావించిన కల్యాణి, అన్ని విషయాల్లోనూ ఆయనకి తోడుగా ఉంటూ నారీ లోకానికి ఆదర్శప్రాయమై నిలుస్తుంది.