శూర్పణఖ వచ్చింది ఇక్కడికేనట !

రామాయణాన్ని చదువుతూ వున్నప్పుడు ... రామాయణాన్ని గురించి వింటున్నప్పుడు ఆయా దృశ్యాలు కనులముందు కదలాడుతూ వుంటాయి. రామాయణానికి సంబంధించిన ఘట్టాలలో 'శూర్పణఖ' ప్రవేశం కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. శూర్పణఖకి జరిగిన అవమానం కారణంగానే, ఆమె సోదరుడైన రావణుడు .. సీతను అపహరించుకు వెళతాడు.

మోహావేశంతో లక్ష్మణుడి చెంత చేరిన శూర్పణఖ, ఆయన సహనాన్ని పరీక్షిస్తుంది. సహనం కోల్పోయిన లక్ష్మణుడు ఆమె 'నాశిక'ను కోసేస్తాడు. ఈ ఘట్టానికి వేదికగా నిలిచిన కారణంగానే ఈ ప్రాంతానికి 'నాశిక్' అనే పేరు వచ్చిందని అంటారు. సీతారాములు ఈ ప్రదేశంలో ఉన్నప్పుడే శూర్పణఖ రావడం జరిగిందని చెబుతారు. తన సోదరికి జరిగిన అవమానం గురించి తెలుసుకున్న రావణుడు, ఇక్కడి 'పంచవటి' నుంచే సీతమ్మవారిని అపహరించాడని అంటారు.

ఇక ఇక్కడ గల గుహలోనే సీతమ్మవారు తలదాచుకుందని చెబుతారు. మాయలేడిని సీత కోరినప్పుడు ఆమెకి రక్షణగా లక్ష్మణుడి నుంచి రాముడు దానిని వేటాడుతూ వెళతాడు. ఆయన ప్రాణాలకి ప్రమాదమేదైనా వాట్టిల్లిందేమోనని సీత ఆందోళన చెందుతుంది. వెంటనే వెళ్లమంటూ సీత ఆదుర్దాని వ్యక్తం చేయడంతో, లక్ష్మణుడు ఆమెను ఈ గుహలో ఉంచి వెళ్లాడని చెబుతారు.

రామాయణానికి సంబంధించిన కొన్ని ఘట్టాలు ఈ ప్రాంతంలో జరిగాయన్నట్టుగా 'నాశిక్' వాసులు విశ్వసిస్తుంటారు. సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించారనడానికి నిదర్శనంగా ఇక్కడ కొన్ని ఆనవాళ్లను చూపుతుంటారు. పంచవటి లోని 'పర్ణశాల'తో పాటు, సీతారాముల మందిరాలు కూడా వాటిలో కనిపిస్తుంటాయి.


More Bhakti News