మామిడిచెట్టుగా మారిపోయిన శివుడు
పరమశివుడు ఆవిర్భవించిన కాంచీపురం ... జంబుకేశ్వరం ... శ్రీకాళహస్తి ... అరుణాచలం ... చిదంబరం 'పంచభూత క్షేత్రాలు'గా చెప్పబడుతున్నాయి. కాంచీపురంలో 'పృథ్వీ లింగం' .. జంబుకేశ్వరంలో 'జలలింగం' ... శ్రీకాళహస్తిలో 'వాయులింగం' ... అరుణాచలంలో 'అగ్నిలింగం' ... చిదంబరంలో 'ఆకాశలింగం దర్శనమిస్తూ వుంటాయి. ఒక్కో క్షేత్రంలో స్వామి ఒక్కో పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.
పృథ్వీలింగం పూజలందుకుంటోన్న కాంచీపురంలో స్వామివారు, 'ఏకామ్రేశ్వరుడు' పేరుతో కొలవబడుతుంటాడు. స్వామివారిని ఈ విధంగా పిలుచుకోవడం వెనుక, ఓ ఆసక్తికరమైన కథనం స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది. ఒకసారి పార్వతీదేవి ... పరమేశ్వరుడి వెనుకగా వచ్చి, సరదాగా ఆయన రెండుకళ్లు మూసిందట. అంతే పంచభూతాలపై ఆయన నియంత్రణ లేని కారణంగా ఆ క్షణ కాలంలోనే ప్రళయం సంభవించింది.
కాంచీపురంలో ధ్యానం చేసుకుంటూ వున్న మార్కండేయ మహర్షికి తపోభంగమైంది. విరుచుకు పడుతున్నట్టుగా తనవైపు దూసుకు వస్తోన్న జల ప్రవాహాన్ని చూసి ఆయన నివ్వెరపోయాడు. ''పరమేశ్వరా'' అంటూ మనసులోనే ఆ స్వామిని స్మరించుకున్నాడు. అంతే ఆ వెల్లువ అతణ్ణి సమీపించబోతుండగా, స్వామి 'మామిడిచెట్టు'లా మారిపోయి ఆయన చెంత నిలిచాడు. ఆ వెల్లువలో కొట్టుకుని పోకుండా ఆ మహర్షి ఆ చెట్టుని ఆసరా చేసుకున్నాడు.
ప్రవాహ ఉధృతి తగ్గిన తరువాత మార్కండేయ మహర్షి ఆ మామిడిచెట్టుకు కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు పరమశివుడు నిజ రూపాన్ని పొందడంతో, మార్కండేయ మహర్షి సంతోషంతో పొంగిపోతూ సభక్తికంగా నమస్కరించాడు. అలా స్వామి తన భక్తుడిని రక్షించడం కోసం ఆమ్రవృక్షముగా మారిపోయినందున, ఏకామ్రేశ్వరుడుగా పిలవబడుతున్నాడు ... కొండంత దైవంగా కొలవబడుతున్నాడు.