ఇక్కడి స్వామికి దేవతలే ఆలయాన్ని కట్టారట!
సాధారణంగా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు, ప్రాచీనకాలం నాటి అక్కడి ఆలయ నిర్మాణం ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది. ఆ ఆలయాన్ని నిర్మించినది సాధారణమైన మనుషులు కాదు ... సాక్షాత్తు దేవతలేనని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. అందువల్లనే అక్కడ అంతటి ప్రశాంతత ... పవిత్రత కనిపిస్తుంది. అక్కడ దేవతలు తిరుగాడుతున్నట్టుగా అనిపిస్తుంది.
అలా దేవతలచే నిర్మించబడిన ఆలయాలలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. పెద్దాపురం మండలం పరిధిలో కనిపించే ఈ క్షేత్రం పేరు కూడా తిరుపతే. ధృవుడి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైంది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ధృవుడిని అనుగ్రహించిన అనంతరం స్వామివారు ఇక్కడే ఆవిర్భవించాడట. అప్పట్లో అదంతా అరణ్యప్రాంతం కావడం వలన, పట్టించుకునే వాళ్లు లేక స్వామివారి మూర్తి అలా ఆరుబయటే ఉండిపోయింది.
జగాలనేలే జగన్నాథుడు అక్కడ అలా వుండటం దేవతలు గమనించారు. భక్తుడిని అనుగ్రహించడానికి వచ్చిన స్వామి, ఆ భక్తుల కోసమే అక్కడ ఆవిర్భవించినట్టు అర్థం చేసుకుని ఆలయాన్ని నిర్మించారట. అలా మొదటిసారిగా స్వామివారికి దేవతలచే ఇక్కడ ఆలయం నిర్మించబడిందట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ ప్రదేశానికి రావడం ... ధృవుడిని అనుగ్రహించడం ... స్వయంభువు మూర్తిగా ఇక్కడే ఉండిపోవడం ... దేవతలు ఆలయాన్ని కట్టించడం వంటి సంఘటనల కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది.