మనసు దృఢమైతే మాయలేం చేస్తాయి ?
హరిశ్చంద్రుడు అసత్యమాడకపోయినా ... తనకిచ్చిన మాట ప్రకారం రుణాన్ని తీర్చినా తాను ఓడిపోయినట్టు అవుతుందని విశ్వామిత్రుడు భావిస్తాడు. హరిశ్చంద్రుడు మాట తప్పేలా చేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఒక రాక్షసుడిని సృష్టించి, వశిష్ఠ మహర్షి రూపంలో హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లి, ఆయన మనసు మార్చుకునేలా చేయమని చెబుతాడు.
దాంతో ఆ రాక్షసుడు ... వశిష్ఠ మహర్షి రూపంలో అక్కడి నుంచి బయలుదేరి, అరణ్య ప్రాంతంలో గల హరిశ్చంద్రుడిని కలుసుకుంటాడు. పరమేశ్వరుడిని స్మరిస్తూ ముందుకుసాగుతోన్న హరిశ్చంద్రుడు, వచ్చింది వశిష్ఠ మహర్షి అనుకుని ఆయనకి వినయంగా నమస్కరిస్తాడు.
విశ్వామిత్రుడి కారణంగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని గురించి హరిశ్చంద్రుడి దగ్గర ఆ మాయావి ప్రస్తావిస్తాడు. తన మంత్ర శక్తితో విశ్వామిత్రుడిని ఎదుర్కుని, తిరిగి రాజ్యాన్ని అప్పగించేలా చేస్తానని అంటాడు. భార్యాబిడ్డలతో అడవిలో ప్రయాణించడం అంత మంచిది కాదనీ, వెనుదిరగడం అన్నివిధాలా మంచిదని చెబుతాడు.
ఆయన సూచనను హరిశ్చంద్రుడు సున్నితంగా తిరస్కరిస్తాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా విశ్వామిత్రుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యమని చెబుతాడు. విశ్వామిత్రుడికి ఇవ్వవలసిన రుణాన్ని గురించి ఆలోచించవద్దనీ, అందుకు అవసరమైన ధనాన్ని తాను ఏర్పాటు చేస్తానని అంటాడు వశిష్ఠ మహర్షి.
తన వ్యక్తిత్వం గురించి తెలిసిన వశిష్ఠ మహర్షి ఎప్పుడూ ఇలా మాట్లాడింది లేదు. అలాంటిది ఆయన ఇలా వత్తిడి చేయడం చూస్తుంటే, వచ్చింది ఆయన కాకపోవచ్చని హరిశ్చంద్రుడుకి సందేహం కలుగుతుంది. అది గ్రహించిన ఆ రాక్షసుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఈ పధకం కూడా విఫలం కావడంతో విశ్వామిత్రుడికి మరింత మనస్తాపం కలుగుతుంది.