సిరిసంపదలను ప్రసాదించే శ్రీనివాసుడు

వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవడం దేవతలకు ... మహర్షులకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. అందువలన భూలోకంలోని మానవాళికి తన దర్శనాన్ని అనుగ్రహించడానికీ ... వారి సేవలను అందుకోవడానికి స్వామి శ్రీనివాసుడుగా దిగివచ్చాడు. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి, పలు ప్రదేశాల్లో ఆవిర్భవించాడు.

ఆ స్వామి ఎప్పుడూ తమ కంటికి ఎదురుగానే ఉండాలని భావించిన భక్తులు, ఆ దివ్యమంగళ మూర్తి ప్రతిమను తమ ఊరు ఆలయాల్లో ప్రతిష్ఠించుకున్నారు. అలా భక్తుల సంకల్పం మేరకు రూపుదిద్దుకున్న వేంకటేశ్వరస్వామి ఆలయం మనకి కోదాడ - బాలాజీ నగర్ లో దర్శనమిస్తుంది. శ్రీదేవి - భూదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి ఇక్కడ దర్శనమిస్తూ వుంటాడు.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆహ్లాదకరంగా అనిపిస్తూ వుంటుంది. చక్కని రూపు ... చల్లని చూపు వేంకటేశ్వరస్వామి సొంతం. అందుకే ఆయన ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆయన అండగా ఉన్నంతవరకూ ఆపదలు దరిచేరవు ... కష్టాలు అలుముకోవు అనే బలమైన విశ్వాసం ఏర్పడుతుంది.

ప్రతి శనివారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ స్వామి అనుగ్రహం కారణంగా విద్యా .. ఉద్యోగాల్లో రాణిస్తున్నవారు, సంతాన సౌభాగ్యాలను పొందిన వాళ్లు ఎంతోమంది వున్నారని ఇక్కడివాళ్లు చెబుతుంటారు. అంకిత భావంతో స్వామిని సేవిస్తే ఆయన సిరిసంపదలను ప్రసాదిస్తాడనీ, ఆయన ఆశీస్సులు తీసుకుని ఏ కార్యక్రమాన్ని ఆరభించినా అది విజయవంతమవుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News