సర్వదోషాలను నివారించే హనుమంతుడు

కొంతమంది కారణం లేకుండానే తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంటారు. తమకీ ... తమ వాళ్లకి ఏదో జరగబోతోందని ఊహించుకుంటూ భయపడిపోతుంటారు. మరికొంతమందికి ఒకే విధమైన కలలు తరచుగా వస్తుంటాయి. కలలో తమని ఎవరో ఏదో చేస్తున్నారంటూ వీళ్లు భయపడుపోతుంటారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కళ్లు మూసుకుని పడుకోవడానికి వీళ్లకి ధైర్యం సరిపోదు.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బాధితులను వెంటబెట్టుకుని, ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తుంటారు. గ్రహ సంబంధమైన దోషాలు ఏవైనా వుంటే అందుకు తగిన శాంతులు చేయిస్తుంటారు. అలాంటి ఆంజనేయస్వామి ఆలయాలలో ఒకటి 'కోదాడ'లో అలరారుతోంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం, కోదాడ నుంచి హుజూర్ నగర్ వెళ్లే రహదారి పక్కన కనిపిస్తూ వుంటుంది. ఇక్కడ స్వామి 'అభయాంజనేయుడు'గా దర్శనమిస్తూ వుంటాడు.

ఒకానొక అడవీ ప్రదేశంలో ఆదరణలేకుండా వున్న ఈ స్వామి, భక్తుల సంకల్పం కారణంగా ఇక్కడికి చేరుకున్నాడట. అలా చాలాకాలం క్రితమే ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అభయముద్రలో ఆరు అడుగుల ఎత్తున దర్శనమిచ్చే ఈ స్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయన చూపిన మహిమల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఆ స్వామి అనుగ్రహం వలన గ్రహ సంబంధమైన దోషాలు ... అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనీ, సంతాన భాగ్యం కలుగుతుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News