ఈ క్షేత్రానికి ఈ పేరు ఇలా వచ్చిందట !
తిరుమల ... శ్రీశైలం ... భద్రాచలం ... అన్నవరం ఇలా ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక పేరు వుంటుంది. ఆయా పుణ్య క్షేత్రాలను దర్శించినప్పుడు, ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం కొంతమంది భక్తులకు కలుగుతూ వుంటుంది. పేరు తెలుసుకునే ప్రయత్నంచేస్తే చాలు, ఆ పుణ్యక్షేత్రం గురించి పూర్తిగా తెలిసిపోతుంది.
గతంలో ఆ క్షేత్రం ఏ పేరుతో పిలవబడిందీ ... ఆ తరువాత ఏ కారణంగా ఆ పేరు మార్పు చెందినదనే విషయాలు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటాయి. అలాంటి ఆసక్తిని రేకెత్తించే క్షేత్రాల్లో ఒకటిగా 'మార్కాపురం' కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిధిలో కనిపించే ఈ ప్రదేశం, పూర్వం 'గజారణ్యం' పేరుతో పిలవబడింది. ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన లక్ష్మీచెన్నకేశవస్వామిని అనునిత్యం ఏనుగులు అభిషేకించేవట. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి గజారణ్యం అనే పేరు వచ్చిందని చెబుతారు.
కాలక్రమంలో మారికా ... మారకులనే భక్తులు స్వామివారిని సేవించి ఆయన సాక్షాత్కారం పొందారు. ఈ కారణంగా ఈ క్షేత్రం 'మారకాపురం' పేరుతో పిలవబడి, ఆ తరువాత 'మార్కాపురం'గా ప్రసిద్ధి చెందినదని అంటారు. అటు పౌరాణిక నేపథ్యాన్ని ... ఇటు చారిత్రక వైభవాన్ని కలిగి అద్భుతమైన శిల్పకళను ఆవిష్కరిస్తోన్న ఈ క్షేత్రాన్ని ఒకసారి చూసి తీరవలసిందే.