భగవంతుడిని క్షమాపణ కోరవలసిందే
సాధారణంగా మనకి బాగా పరిచయమున్న వాళ్లు, ఏదైనా ఒక వస్తువును మనకిచ్చి దానిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం జరుగుతుంటుంది. అనుకోని కారణాల వలన అ వస్తువును పదిలంగా ఉంచలేకపోతే, వాళ్లు ఏమనుకుంటారోననే ఆలోచన నిద్రపట్టకుండా చేస్తుంటుంది. తమపై వాళ్లు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోలేక పోయినందుకు బాధగా అనిపిస్తుంది. వాళ్లని నేరుగా కలిసి క్షమించమని కోరే వరకూ మనసు ... మనసులో ఉండదు.
అలాంటిది .. సార్ధకం చేసుకోమంటూ భగవంతుడు ఉత్తమమైనటువంటి మానవజన్మను ప్రసాదిస్తే, దానికి ఎంతవరకూ న్యాయం చేస్తున్నామనే ఆలోచన ఎంతమందికి కలుగుతుంది ? ఉదయం నిద్రలేచింది మొదలు తెలిసో తెలియకో కొన్ని అపరాధాలు చేయడం జరుగుతుంది. వాటికి భగవంతుడిని క్షమాపణ అడుగుదామనే ఆలోచన ఎంతమందికి వస్తుంది ? అంటే ... చాలా తక్కువమంది మాత్రమే ఈ విధమైన ఆలోచనచేసే వాళ్లుగా కనిపిస్తుంటారు.
మానవ లభించడమే మహాకష్టమైన విషయం .. అలాంటి మానవ జన్మను పొందిన వాళ్లు దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అపరాధం తమ వలన జరిగివుంటే క్షమించమని దైవాన్ని కోరుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రివేళ నిద్రకి ఉపక్రమించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలని శాస్త్రం చెబుతోంది.
"కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా ..
శ్రవణనయనజం వా మానసంవా
ప రాధమ్ ..
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ ..
శివ శివ కరుణాబ్దే హే మహాదేవ శంభో"
చేతులతో గానీ .. కాళ్లతో గాని .. మాటలచేత గాని ... శరీరం చేత గాని .. చెవులతో గాని .. కనులతో గాని .. తెలిసి తెలియక గాని అపరాధం చేసినట్లయితే, కరుణా సముద్రుడైన ఓ మహాదేవా .. నన్ను క్షమించు. అనేది ఈ శ్లోకం అర్థంగా చెప్పబడుతోంది. ప్రతి రోజు నిద్రకి ఉపక్రమించడానికి ముందు ఈ శ్లోకాన్ని పఠించడం వలన, అపరాధాలు ఏవైనా చేసి వుంటే వాటి ఫలితంగా సంక్రమించే దోషాలు శివుడి అనుగ్రహం కారణంగా తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది.