ఇక్కడ కొబ్బరి కల్లు తీర్థంగా ఇస్తారట !
సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళితే తులసినీళ్లను గానీ ... పానకాన్ని గాని ... పాలను గాని తీర్థంగా ఇస్తుంటారు. ఇక అభిషేకాలు చేసిన రోజున పంచామృతాలను తీర్థంగా ఇస్తుంటారు. ఇక ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ పద్ధతులను బట్టి తీర్థప్రసాదాలను ఇస్తుంటారు. అలా 'కొబ్బరి కల్లు' ను తీర్థంగా ఇచ్చే ఆలయం మనకి 'మలనాడు'లో కనిపిస్తుంది.
కేరళా ప్రాంతానికి చెందిన ఈ ఆలయంలో కొబ్బరి కల్లును తీర్థంగా ఇస్తారని తెలిసి ఆశ్చర్యపోయేవాళ్లు, ఈ ఆలయంలో పూజలు అందుకునేది 'దుర్యోధనుడు' అని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఈ ప్రాంతవాసులు దుర్యోధనుడిని పూజించడానికీ ... ఆయన దర్శనానికి వచ్చినవారికి కొబ్బరి కల్లును తీర్థంగా ఇవ్వడమనే ఆచారం వెనుక బలమైన కారణమే కనిపిస్తూ వుంటుంది.
పాండవులపై విజయం సాధించడానికి అవసరమైన కొన్ని విద్యలను తెలుసుకోవడం కోసం దుర్యోధనుడు ఈ ప్రాంతానికి వచ్చాడట. అలా వచ్చిన ఆయనని ఈ ప్రాంతవాసులు ఆప్యాయంగా ఆదరించి కొబ్బరికల్లుతో దాహం తీర్చారు. ఆ కొబ్బరి కల్లు పట్ల ఆయన ఎంతో ఇష్టాన్ని కనబరిచాడు. ఈ ప్రాంతవాసుల ఆదరణకు మెచ్చి తరతరాలపాటు వాళ్లు సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని అనుభవించడానికి ఏర్పాట్లు చేశాడట. ఆ కృతజ్ఞతతోనే ఇక్కడ ఆయనకి ఆలయం నిర్మించారనీ, ఆయనకి ఇష్టమైన కొబ్బరి కల్లుని తీర్థంగా ఇవ్వడం జరుగుతోందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు.