అందుకే ఈ నది మహిమగలదని అంటారు !

వరసిద్ధి వినాయకుడు ఆవిర్భవించిన కాణిపాకం ... మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక్కడ స్వామివారు ఆవిర్భవించిన తీరు ... సత్య ప్రమాణాలకు ఆయనను న్యాయనిర్ణేతగా విశ్వసించే తీరు ... ఇక్కడ ప్రవహిస్తోన్న బహుదానదికి గల విశిష్టత ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని చెప్పకనే చెబుతుంటాయి.

కాణిపాకాన్ని దర్శించిన భక్తులను పునీతులను చేసే 'బహుదానది'కి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. నిజానిజాల మాటెలా వున్నా వినడానికి మాత్రం ఈ కథనం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది. పూర్వం అనుబంధానికి ప్రతీకలుగా కనిపించే ఇద్దరు అన్నదమ్ములు, ఓ నిందారోపణ నిమిత్తం రాజుగారి ఎదుట ప్రవేశపెట్ట బడతారు.

ఆ ఇద్దరిలో తమ్ముడే తప్పుచేశాడని భావించిన రాజు, అతనిని శిక్షించ వలసిందిగా సంబంధిత అధికారులకు చెబుతాడు. ఫలితంగా తమ్ముడి రెండు చేతులు తీసివేయబడతాయి. జీవితం పై విరక్తి చెందిన తమ్ముడికి అన్నయ్య ధైర్యం చెబుతాడు. భగవంతుడి దృష్టిలో అతను చేసింది తప్పేకాదనీ, ఆ విషయాన్ని కాణిపాకం వరసిద్ధి వినాయకుడే నిరూపిస్తాడని ఈ క్షేత్రానికి తీసుకువస్తాడు. స్వామి దర్శనానికి ముందు ఇక్కడి నదిలో స్నానం చేయిస్తాడు.

చేతులు కోల్పోయిన వ్యక్తి నదిలోకి దిగి మూడు మునకలు వేస్తాడు. అంతే .. శిక్ష పడటానికి ముందు తన రెండుచేతులు ఎలా ఉండేవో ... ఇప్పుడు అలాగే ఉండటం చూసుకుని సంతోషంతో పొంగిపోతాడు. అతన్ని చూసిన వాళ్లంతా ఆయన తప్పుచేయలేదని నమ్ముతారు. స్వామివారితో పాటు ఆయన క్షేత్రాన్ని మరింత పవిత్రం చేసే ఈ నది కూడా మహిమగలదని భావిస్తారు. చేతులు (బాహువులు) ను ప్రసాదించిన నది కనుక, అప్పట్లో దీనిని 'బాహుదానది' అని పిలిచే వాళ్లట. కాలక్రమంలో అది మార్పులకులోనై బహుదానదిగా ప్రసిద్ధి చెందిందని అంటారు.


More Bhakti News