గర్భాలయం నుంచి నడిచొచ్చిన స్వామి !
శ్రీమన్నారాయణుడు తన భక్తులు పరవశిస్తూ పిలిచినా ... విలపిస్తూ పిలిచినా వివిధ రూపాల్లో అక్కడికి చేరుకొని వాళ్లని అనుగ్రహించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తన సన్నిధిలో తనని కీర్తిస్తే అసమానమైన ఆ భక్తికి ముగ్ధుడై ఆయన గర్భాలయంలో నుంచి వచ్చిన సందర్భాలు కొందరు మహాభక్తుల విషయంలో మాత్రమే జరిగింది. అలాంటి మహాభక్తుల జాబితాలో 'కృష్ణామాచార్యులు' ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తాడు.
కృష్ణమాచార్యులు పేరు వినగానే 'సింహాచలం' క్షేత్రం గుర్తుకు వస్తుంది ... ఆ స్వామిపై ఆయన కొనసాగించిన వచన రచనలు గుర్తుకు వస్తాయి. ప్రతిరోజు ఇక్కడి స్వామివారిని చూడకుండా ... ఆయన ఎదురుగా కూర్చుని ఆశువుగా కీర్తించకుండా కృష్ణమాచార్యులు ఉండలేకపోయేవాడు. ఇక అనుదినం ఆయన ఆశువుగా ఆలాపనతో అర్చించే తీరుకి నరసింహస్వామి పరవశించిపోయేవాడట.
అలా స్వామి దర్శనం కోసం ఎప్పుడు తెల్లవారుతుందా అని కృష్ణామాచార్యులు ... ఆయన ఆశువుగా చెప్పే వచనాల కోసం నరసింహస్వామి ఎదురుచూస్తూ ఉండేవాళ్లట. ఒకరోజున కృష్ణమాచార్యులు స్వామివారికి ఎదురుగా కూర్చుని తనని తాను మరిచిపోయి వచనాలు చెబుతూ వుంటే, లక్ష్మీ నరసింహస్వామి చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి, ఆయన ఒడిలో కూర్చుని ఆ వచనాలను తాళ పత్రాలపై వ్రాయసాగాడట.
కృష్ణమాచార్యులు అనుభూతి ప్రపంచంలో నుంచి ఈ లోకంలోకి వస్తూ ఆ పిల్లవాడిని చూశాడు. దాంతో ఆ బాలుడు ఆ తాళ పత్రాలను అక్కడ వుంచి నడచుకుంటూ గర్భాలయంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడట. అంతే కృష్ణమాచార్యుల వారి ఆనందానికి అవధులులేకుండా పోయాయి. ఆ చిట్టి పాదాలు తాకిన నేలను ఆయన కళ్లకి అద్దుకున్నాడు. ఆశువుగా తాను చెబుతున్న వచనాలను అక్షరబద్ధం చేయమని చెప్పడం కోసమే స్వామి అలా దర్శనమిచ్చాడని అర్థం చేసుకున్నాడు. ఆనాటి నుంచి తన వచనాలతో స్వామివారిని కీర్తిస్తూ ... ఆ రచనలను అక్షరబద్ధం చేస్తూ వచ్చాడు.