దక్షిణాయనం ఆరంభంలో ఏం చేయాలి ?
'ఆషాఢ బహుళ చవితి' నుంచి దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది. సాధారణంగా సూర్యుడు ప్రతి మాసంలోను ఒకరాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ వుంటాడు. దీనినే సంక్రమణ కాలం అని అంటూ వుంటారు. అలా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి, మకరరాశిలోకి ప్రవేశించేంత వరకూ గల కాలాన్ని 'దక్షిణాయణం' అంటారు.
దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయణం రాత్రిగా చెప్పబడుతోంది. అందువలన పగటి కాలమైన ఉత్తరాయణంలో శుభకార్యాలు ... దైవకార్యాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కాలమంతా కూడా వివిధ రకాల వేడుకలతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తూ వుంటుంది. ఇక దేవతలకు రాత్రి భాగంగా చెప్పబడుతోన్న దక్షిణాయణం పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెబుతుంటారు.
అందువల్లనే ఈ సమయంలో పితృకార్యాలనే తప్ప, శుభకార్యాలుగానీ ... దైవకార్యాలుగాని జరపరు. అయితే దక్షిణాయణం ఆరంభంలో పుణ్యస్నానాలు చేయడం ... దేవతారాధన చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది. సంక్రమణ కాలంలో చేసే పుణ్యస్నానాల వలన ... దేవతారాధన వలన ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది.