బృహదీశ్వరాలయం

తమిళనాడు - తంజావూరులో కొలువుదీరిన 'బృహదీశ్వర ఆలయం' ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. వేయి సంవత్సరాల క్రితం చోళ ప్రభువైన రాజరాజు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి. 'పెరియ కోవిల్'(పెద్ద ఆలయం)గా చరిత్రలో నిలిచిపోయిన ఈ ఆలయం, ఆనాటి శిల్పకళా వైభవానికి అద్దం పడుతోంది. రాజరాజు తంజావూరును రాజధానిగా చేసుకుని క్రీ. శ. 985 నుంచి 1012 వరకూ పరిపాలించాడు. శివ భక్తుడైన రాజరాజు ఆ స్వామికి అతిపెద్ద ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం భక్తులకు కూడా ఇవ్వడం విశేషంగా అనిపిస్తుంది.

ఈ దేవాలయం నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ నిక్షేపాలను ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో వున్న'పుదుకోవై' అనే ప్రాంతంలోని కొండలను తొలిచి అక్కడినుంచి తెప్పించి ఉంటారని చెబుతుంటారు. ఆలయ పైభాగానికి కప్పుగా 80 టన్నుల బరువుగల ఏకశిలను ఉపయోగించారు. ఈ రాయిని గుడి పైకి చేర్చడానికి వారు ప్రత్యేకమైన వంతెన వంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. 13 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించడమే కాకుండా, నర్మదా నదీ ప్రాంతం నుంచి తెప్పించిన 13 అడుగుల 'ఏకశిల'ను గర్భాలయంలో శివలింగంగా మలిచారు. ఈ శివలింగానికి అభిషేకం నిర్వహించడానికి రెండు వైపులా మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 8 అడుగుల వెడల్పు ... 12 అడుగుల ఎత్తు గల నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా ఏకశిలలోనే మలిచారు. లేపాక్షి బసవన్న తరువాత ఆ స్థాయి విగ్రహం ఇదేనని చెబుతూ వుంటారు.

ఇక ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇటుకలు గానీ ... బంకమట్టి గానీ ... సున్నపురాయినిగాని ఉపయోగించలేదు. ఎలాంటి పూతలు కూడా వాడకుండా కేవలం రాయి పై రాయిని పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించిన తీరు ఆశ్చర్య పరచకమానదు. ఇక ఆలయ గోడల బయట ... లోపల కూడా అనేక శిల్పాలను ... చిత్రాలను చెక్కించారు. ఆనాటి సంస్కృతి - సంప్రదాయాలను ఈ కుడ్య చిత్రాలు చాటిచెబుతూ వుంటాయి. స్వామివారి నిత్య సేవలకు గాను రాజరాజు అనేక మాన్యాలను ఆలయానికి రాసిచ్చారు. ఆయన సంకల్ప బలం ... అంకిత భావం వల్లనే ఈ నాటికీ ఈ బృహదీశ్వర ఆలయం తన ప్రత్యేకతను ... విశిష్టతను చాటుకుంటూనే వుంది.


More Bhakti News