క్షేత్ర దర్శనం సంతృప్తికరంగా ఉండాలంటే ?

వివాహ వేడుకలకి ... విహార యాత్రలకి కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు వెళ్లిరావడం జరుగుతూ వుంటుంది. ఇక పుణ్యక్షేత్రాలకి అనగానే కుటుంబసభ్యులందరూ కలిసి బయలుదేరుతుంటారు. ఎంత ఖర్చైనా ఎక్కడా ఇబ్బంది కలగకుండా వెళ్లిరావాలని నిర్ణయించుకుంటారు. ఏదైతే క్షేత్రానికి వెళదామని అనుకుంటారో ఆ క్షేత్రానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు.

ఇక ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా అక్కడికి దగ్గరలో మరికొన్ని క్షేత్రాలు వుండటం జరుగుతూ వుంటుంది. వాటిలో ఒక క్షేత్రానికి వెళ్లివద్దామనీ ... అక్కడి వరకూ వచ్చి ఆ స్వామిని దర్శించకపోతే ఆయనకి కోపం వస్తుందని ఒకరంటారు. అక్కడి కన్నా మరో చోటికి వెళ్లడం అన్నివిధాలా మంచిదనే అభిప్రాయాన్ని మరొకరు వ్యక్తం చేస్తారు. ఇక తిరగడం తనవల్ల కాదనీ, వెనక్కి వెళ్లిపోదామని ఇంకొకరు అంటారు.

దాంతో అందరిమధ్య అయోమయం ... అసహనం నెలకొంటుంది. ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోలేని ఊగిసలాట మొదలవుతుంది. ఎవరి అభిప్రాయం ప్రకారం నడచుకున్నా మిగతా వాళ్లు చిన్నబుచ్చుకోవడం ... అలగడం వంటివి చేస్తుంటారు. తమకి ఇష్టంలేని చోటికి తీసుకువచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు. కుటుంబంలో ఎవరు ఆనందంగా లేకపోయినా, ఆ ప్రభావం అందరిపై పడుతుంది. ఫలితంగా ఏ క్షేత్రానికి వెళ్లినా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించలేకపోతారు ... దైవదర్శనం వలన దక్కే అనుభూతిని పొందలేకపోతారు.

ఇక ముందుగా ఏదైనా క్షేత్రానికి వెళదామనుకుని ఆ వెంటనే వద్దనుకుని వెనుదిరుగుతే, ఆ తరువాత ఏ చిన్న సమస్య వచ్చినా తాము అలా చేసినందుకేనని ఇలా జరిగిందని బాధపడుతుంటారు. అందుకే ఏదైనా ఒక క్షేత్రానికి బయలుదేరడానికి ముందే, ఆ క్షేత్రానికి దగ్గరలో గల మిగతా క్షేత్రాలను గురించి తెలుసుకోవాలి. తమకున్న సమయలో ఎక్కడెక్కడికి వెళ్లిరాగలరో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలోచించుకోవాలి.

ఆయా ప్రదేశాలకి వెళ్లి రావడం అందరికీ ఇష్టమో కాదో అనే విషయంలో స్పష్టత రావాలి. అందరి ఆరోగ్యాలను ... అభిరుచులను ... అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అంతా కలిసి వివిధ క్షేత్రాలను సంతోషంతో దర్శించగలుగుతారు ... సంతృప్తితో తిరిగి రాగలుగుతారు.


More Bhakti News