నరక బాధలను తప్పించే తీర్థం ఇక్కడ వుంది !
సాధారణంగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించేవాళ్లు అక్కడ గల తీర్థాలలో స్నానమాచరిస్తూ ఉంటారు. ఒక్కో పుణ్య విశేషాన్ని కలిగివుండే ఈ తీర్థాలు పాపాలను నశింపజేయడమే కాకుండా, కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటాయి ... ప్రతి క్షేత్రంలోను అంతర్భాగమై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాయి. అలా అనేక తీర్థాలతో అలరారే క్షేత్రంగా 'రామేశ్వరం' దర్శనమిస్తూ వుంటుంది.
రామ నామాన్ని స్మరించే ప్రతిఒక్కరూ రామేశ్వరాన్ని దర్శించాలని ఆరాటపడుతుంటారు. ఈ ప్రదేశాన్ని చూడటం ... ఇక్కడి నేలను స్పర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. అంతటి పుణ్య క్షేత్రానికి మరింత విశిష్టతను చేకూరుస్తూ ఇక్కడ ఇరవైరెండు తీర్థాలు కనిపిస్తుంటాయి. నరక బాధలను తప్పించే 'కవచ తీర్థం' ఇక్కడే మనకి కనిపిస్తుంది.
ఇక మిగతా తీర్థాల జాబితాలో, సూర్య తీర్థం .. చంద్ర తీర్థం .. శంఖ తీర్థం .. చక్ర తీర్థం .. సేతుమాధవ తీర్థం .. శివ తీర్థం .. లక్ష్మీ తీర్థం .. సావిత్రీ తీర్థం .. సరస్వతీ తీర్థం .. గంగా తీర్థం .. గాయత్రీ తీర్థం .. యమునా తీర్థం .. గంధమాదన తీర్థం .. గయ తీర్థం .. గవయా తీర్థం .. నలతీర్థం .. నీలతీర్థం .. జటాతీర్థం .. కోటితీర్థం ... సర్వతీర్థం .. సత్యామృత తీర్థం దర్శనమిస్తాయి.
సాధారణంగా 'నరకం' అనే మాట వినగానే మనసంతా ఆందోళనకి లోనవుతుంది. అక్కడే పెట్టే బాధలను గురించి వింటే భయంతో నిద్రకూడా పట్టదు. ఆ నరక బాధలు తమకి లేకుండా చూడమనే ప్రతిఒక్కరూ దైవాన్ని కోరుకుంటూ వుంటారు. ఇక్కడి 'కవచ తీర్థం' లో స్నానం చేయడం వలన అలాంటి ఆందోళన తొలగిపోతుందని అంటారు. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన జన్మజన్మల పాపాలు పూర్తిగా నశిస్తాయనీ, నరక బాధల బారిన పడకుండా చేస్తుందని చెప్పబడుతోంది.