వినాయకుడిని ఆరాధించకపోతే అనర్థమే
దైవకార్యాలు ... శుభకార్యాలు ఏవి మొదలుపెట్టినా గణపతిని పూజిస్తూ వుండటం పురాణకాలం నుంచి వస్తోంది. మంచి కార్యాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూసే శక్తి సామర్థ్యాలు వినాయకుడు కలిగివుంటాడు. సాధారణ మానవులు ... మహర్షులు ... దేవతలు సైతం తాము తలపెట్టిన కార్యాలు సఫలీకృతం కావాలంటే, ఆరంభంలో వినాయకుడిని ఆరాధించవలసిందే.
తొందరపాటునో ... పొరపాటునో గణపతిని పూజించడం మరిచిపోతే అనేక ఆటంకాలను ఎదుర్కోవలసిందే. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఈ విషయాన్ని ఇంద్రాది దేవతలకు సెలవిచ్చాడు. అమృతాన్ని సాధించడం కోసం దేవదానవులు రంగంలోకి దిగుతారు. 'వాసుకి' సర్పాన్ని తాడుగా ... మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు.
అయితే ఆరంభించిన కాసేపటికే ఆ పర్వతం సముద్రంలోకి జారిపోవడంతో అంతా నివ్వెరపోతారు. ఏం చేయాలో పాలుపోవడంలేదంటూ విషయాన్ని శ్రీమహావిష్ణువుకు విన్నవిస్తారు. సముద్రమథనానికి ముందు గణపతిని పూజించకపోవడం వల్లనే అలా జరిగిందని అంటాడు విష్ణుమూర్తి. గణపతిని ఆరాధించకుండా ఆరంభించిన ఏ కార్యక్రమం సఫలీకృతం కాదని చెబుతాడు.
దాంతో వాళ్లు గణపతిని ఆరాధించి, తిరిగి తమ ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అప్పుడే శ్రీమహావిష్ణువు 'కూర్మావతారం' ధరించి, మందర పర్వతాన్ని తన 'మూపు'పై మోస్తాడు. అలా సముద్ర మథనానికి సహకరించి 'అమృతం' లభించేలా చేస్తాడు. అలా ఈ సంఘటన గణపతి పూజా విశిష్టతను ... దాని మహాత్మ్యాన్ని మరోమారు లోకానికి చాటిచెప్పింది.