తరాలపాటు పుణ్యం దక్కాలంటే ఏం చేయాలి ?
అనుదినం భగవంతుడిని పూజించడం ... అనుక్షణం ఆయన నామాన్ని స్మరించడం చేస్తూ వుంటే, పుణ్యమనేది వారి వారి ఖాతాలో చేరిపోతూనే వుంటుంది. అలాగే నీతిబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ, దానధర్మాలు చేస్తూ వుండటం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. గతంలో పాపాలు చేసిన వాళ్లు ఆ తరువాత మనసు మార్చుకుని పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టినా, ఆ పాపాలు ఎక్కడికీ పోవు. అటు పాపం చేసినందుకు ... ఇటు పుణ్యం చేసినందుకు దేని ఫలితాన్ని దానికి అనుభవించవలసిందే.
ఇక భగవంతుడు క్షమించలేని పాపాలు చేసినప్పుడు, వారి కుటుంబసభ్యులు కూడా తరతరాల పాటు ఆ ఫలితాన్ని అనుభవించ వలసి వస్తుంది. భగవంతుడి మనసుకి సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు, ఆయన ఆ భక్తులతో పాటు వారి వంశాన్నే అనుగ్రహిస్తుంటాడు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు మనకి ఆయా క్షేత్రాల్లో వినిపిస్తూ వుంటాయి. భగవంతుడి మనసు గెలుచుకోవడానికీ ... తరతరాలపాటు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలనే సందేహం కొంతమందిలో కలుగుతూ వుంటుంది.
వివిధ రకాలుగా భగవంతుడిని సంతోషపెట్టడమే అందుకు మార్గమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రాచీనకాలంనాటి దేవాలయాలు ఎన్నో వాటి వైభవాన్ని కోల్పోయి మరుగున పడుతున్నాయి. అలాంటి దేవాలయాలను ఎంచుకుని వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలి. భక్తుల తాకిడి ఎక్కువగా వుండే వివిధ పుణ్యక్షేత్రాల్లో, అన్నదానం కోసం ఆర్ధిక సాయాన్ని అందించాలి. ఇక మారుమూలనున్న కొన్ని గ్రామాల్లో ఆర్ధికపరమైన సమస్య కారణంగా భగవంతుడి సేవలకుగాను ఎలాంటి దైవ సంబంధమైన వాహనాలు కనిపించవు. అందువలన ఉత్సవాల సందర్భంలో పల్లకీని గానీ ... ఆటోలను గాని ఉపయోగిస్తుంటారు.
వివిధ రకాల వాహనాలను తయారు చేయించి అలాంటి ఆలయాలకు బహుకరించవచ్చు. రథం ... గజ వాహనం ... అశ్వవాహనం ... హనుమ వాహనం ... గరుడ వాహనం ... శేష వాహనం ... హంసవాహనం ఇలా ఎన్నో వాహనాలను స్వామివారికి సవినయంగా సమర్పించుకోవచ్చు. ఒక్కో వాహనం దైవానికి సమర్పించడం వలన, ఒక్కో పుణ్యఫల విశేషం తరతరాలను ప్రభావితం చేస్తుంది. ఇలా దేవాలయాల ఉన్నతికి ... స్వామివారి వైభవానికి ... భక్తుల ఆకలి తీర్చడానికి ఎవరైతే పాటుపడతారో, ఆ పుణ్యఫలాల విశేషం కారణంగా వారితో పాటు వారి తరతరాలు ఉద్ధరించబడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.