భక్తిబీజాలు వెదజల్లిన మహనీయుడు
ప్రాచీనకాలంలో కులమతాలు ... ధనిక - బీద తారతమ్యాలు ... మూఢనమ్మకాలు సమాజాన్ని ప్రభావితంచేస్తూ ఉండేవి. ఈ మూడు కూడా ప్రజలమధ్య సఖ్యతను దెబ్బతీస్తూ ఉండేవి. గ్రామాలకు చెందిన పెద్దలు ఈ మూడింటిని తమ ఆయుధాలుగా చేసుకుని ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకునే వాళ్లు. ఇక వాళ్లు చెప్పేదే వేదం ... చేసేదే చట్టమై నడుస్తూ వుండేది. అలా ఈ ప్రభావం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా కలుషితం చేయడం మొదలుపెట్టింది.
ఆనాటి ప్రజల బలం ... బలహీనత వాళ్లకి గల ఆధ్యాత్మిక పరిజ్ఞానంపై ఆధారపడి వుండేది. ఈ కారణంగా పెద్దలనబడే వాళ్లు ఈ విషయంలోనూ జోక్యం చేసుకుని, వ్యవస్థను మరింత పతనంవైపు పరిగెత్తించడానికి ప్రయత్నించారు. అలాంటి పరిస్థితుల్లోనే 'బసవేశ్వరుడు' రంగప్రవేశం చేయడం జరిగింది. 'వైశాఖ శుద్ధ తదియ' రోజున జన్మించిన బసవేశ్వరుడు, బాల్యం నుంచే అసమానమైన ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శిస్తూ వీరశైవ సంప్రదాయ వ్యాప్తికి తనవంతు కృషి చేశాడు.
క్రీ.శ.1131లో జన్మించిన బసవేశ్వరుడు ఆనాటి సమాజాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశాడు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని కనీస ధర్మంగా కలిగి ఉండాలనీ, తమతమ వృత్తుల్లో కొనసాగుతూనే దైవాన్ని సేవించాలని చెప్పాడు. ఒక వ్యక్తి వ్యవస్థను ఎదురించడం, మూఢనమ్మకాలనబడే సంకెళ్లను తెంచివేయడం ... భక్తి మార్గంవైపు ప్రజలను మళ్లించి, వాళ్లని చైతన్యవంతులను చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ఆ పనిని అత్యంత సమర్ధవంతంగా బసవేశ్వరుడు నిర్వహించాడు. ఇందుకోసం ఆయన తన రచనలను ఆయుధాలుగా మార్చుకున్నాడు. 4,64 000 వచనాలను కన్నడ ప్రాంతంలోగల వ్యవహారిక భాషలో రంచించాడు.
పామరులకు సైతం తేలికగా అర్థమయ్యే ఈ రచనల్లో ప్రస్తుతం కొన్ని మాత్రమే లభిస్తుండగా, వాటిని అమూల్యమైనవిగా వీరశైవులు భావిస్తుంటారు. ప్రజల మధ్య సమానత్వాన్నీ ... సమైక్యతను పెంపొందిస్తూ, వాళ్లందరినీ భక్తిమార్గంలో నడిపించిన బసవేశ్వరుడిని అంతా శివాంశ సంభూతుడిగా విశ్వసిస్తుంటారు. బసవేశ్వరుడి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, వీరశైవులు ఆయన ఆరాధన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.