భక్తుడి ఇంటికే నడిచొచ్చిన దేవుడు !

ఎవరి అవసరమైతే వాళ్లే సాయంచేసే వారి చెంతకి రావాలనే విషయం లోకం పోకడగా కనిపిస్తూ వుంటుంది. కానీ భగవంతుడు మాత్రం, తన భక్తులు తన దగ్గరికి రాలేని పక్షంలో తానే వాళ్ల దగ్గరికి వెళుతూ ఉంటాడు. అసమానమైన భక్తి శ్రద్ధలను కలిగివుంటే ఆ భగవంతుడే వెతుక్కుంటూ వస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి. అలాంటివాటిలో ఒకటి ఖమ్మం జిల్లాకి చెందిన 'వనంవారి కృష్ణాపురం'లో కనిపిస్తుంది.

కృష్ణయ్య అనే భక్తుడి వనంలో స్వామివారు ఆవిర్భవించిన కారణంగా ఈ ఊరుకి ఈ పేరు వచ్చింది. ఇక్కడ సీతారామలక్ష్మణుల ప్రతిమలు అచ్చు భద్రాద్రి సీతారాముల విగ్రహాలను పోలివుంటాయి. ఇందులో ఆశ్చర్యపోవలసినదేముంది ? ... భద్రాచలం సీతారాములను చూసి అచ్చు అలాంటివే చేయించారేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవి తయారుచేసిన విగ్రహాలు కాదు ... భద్రాచల సీతారాముల మాదిరిగానే స్వయంభువు మూర్తులు.

చాలాకాలం క్రిందట కృష్ణయ్య అనే భక్తుడు, ప్రతియేటా భద్రాచలం కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేవాడు. వయసుపైబడటంతో శరీరం సహకరించక ఆయన ఇంటికే పరిమితమైపోయాడు. భద్రాద్రి రాముడిని చూడలేనంటూ బెంగపెట్టుకున్నాడు. ఆయన బెంగ తీర్చడం కోసమే అచ్చు భద్రాద్రిలో మాదిరిగానే స్వామి ఇక్కడ వెలిశాడు. తన భక్తుడికి ముందుగా చెప్పి మరీ ఆయన ఇక్కడ ఆవిర్భవించాడు.

భక్తుడిని వెతుక్కుంటూ భగవంతుడు రావడం, ఆయన సేవించుకోవడానికి ఇచ్చారూపంలో ఆవిర్భవించడం చాలాచోట్ల జరిగింది. అందుకు భిన్నంగా భక్తుడు ఆరాధించే రూపంలోనే భగవంతుడు వెలవడం ఇక్కడి విశేషం. ఈ కారణంగానే ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తుంటారు. మరో భద్రాద్రిగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News