భూగర్భంలో కొలువైన శ్రీనివాసుడు

సాధారణంగా శ్రీనివాసుడు తాను కొలువై ఉండటానికి కొండలనే ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు ... పచ్చదనం చూసి పరమానందభరితుడు అవుతుంటాడు. ప్రశాంతమైన వాతావరణం గల పవిత్రమైన కొండలపై అలరారుతూ అలసటలేకుండా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి శ్రీనివాసుడు భూగర్భంలో కొలువై వుండటం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.

ఈ కారణంగానే ఇక్కడి స్వామిని పాతాళ శ్రీనివాసుడుగా కొలుస్తూ వుంటారు. శ్రీనివాసుడి దర్శనం కోసం కొండలు ఎక్కాలని మాత్రమే తెలిసిన భక్తులకు, ఆయన కోసం భూగర్భంలోకి దిగడం చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. శ్రీనివాసుడు ఎక్కడ వున్నా ఆయన వైభవం తగ్గదు ... ఆయన దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గదు. అందుకు నిదర్శనంగా కనిపించేదే 'తిరుకుడందై' క్షేత్రం.

తమిళనాడు ప్రాంతంలో గల విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటిగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రంలో ప్రధాన దైవంగా శారంగపాణి పెరుమాళ్ ... కోమలవల్లీ తాయారు దర్శనమిస్తూ వుంటారు. ఈ గర్భాలయం రథం ఆకారాన్ని పోలివుండటం విశేషం. సూర్యభగవానుడి కోరిక మేరకు ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన శారంగపాణి అనుగ్రహంతో పాటు సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు.

ఎంతోమంది మహర్షులు ... మహారాజులు స్వామివారిని సేవించి తరించారు. ఈ ప్రాంగణంలోనే గర్భగృహంలో శ్రీనివాసుడు దర్శనమిస్తూ ఉంటాడు. తన కోసం వచ్చిన భక్తులకు చిరునవ్వులు చిందిస్తూనే వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. విశేషమైన పుణ్య తిథుల్లో స్వామివారి వైభవం చూసితీరవలసిందే.


More Bhakti News