సత్యాన్ని మాత్రమే పలికించే సత్యస్తంభం

పూర్వకాలంలో ప్రతి గ్రామానికి ఒక కట్టుబాటు ఉండేది. అందరూ దానికి తగినట్టుగా నడచుకునేవారు. ఎవరైనా సరే అవినీతికి .. అన్యాయానికి ... మోసానికి పాల్పడితే శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే ఈ సత్య పరీక్షలు జరిపే ప్రదేశంగా ... శిక్షను అమలుపరిచే ప్రదేశంగా ఆ గ్రామ ఆలయ ప్రాంగణమే కనిపిస్తూ ఉంటుంది.

భగవంతుడి సన్నిధిలో అసత్యం చెప్పడానికి ఎవరైనా సరే భయపడతారనీ, అదే భగవంతుడికి భయపడి గ్రామపెద్దలు సరైన తీర్పు చెబుతారనే ఉద్దేశంతోనే పూర్వీకులు ఈ విధమైన ఏర్పాటును చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేటికీ కొన్ని క్షేత్రాల్లో సత్య నిరూపణలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి క్షేత్రాల్లో కృష్ణా జిల్లాకి చెందిన 'పెదకళ్ళేపల్లి' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.

'శ్రీదుర్గానాగేశ్వరస్వామి' ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో ప్రాచీనకాలం నాటి 'సత్యస్తంభం' ఒకటి కనిపిస్తుంది. వివిధ విషయాలకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న వాళ్లు, తమపై పడినది నిందేననీ ... నిజంకాదని ఈ సత్య స్తంభాన్ని తాకి ప్రమాణం చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఈ సత్య స్తంభాన్ని తాకిన వారు దాని ప్రభావం వలన ... శివయ్య భయం వలన అసత్యమాడరట. అలా అసత్యం చెప్పడానికి ప్రయత్నించిన వాళ్లు దేవుడి ఆగ్రహానికి గురై ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతుంటారు.

గతంలో కొందరికి జరిగిన ఈ రకమైన అనుభవాలను గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ అనుభవాలే ఆ తరువాత తరాలవారికి పాఠాలుగా పనిచేస్తున్నాయి. పరమశివుడికి ప్రతిరూపంగా ... పవిత్రమైనదిగా చెప్పుకునే ఈ సత్య స్తంభానికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ సత్య స్తంభాన్ని దర్శించిన తరువాతనే ప్రధాన దైవాన్ని పూజించడానికి వెళుతుంటారు. ఈ గ్రామానికి సంబంధించిన వివాదాస్పద విషయాలన్నీ కూడా ఇక్కడే పరిష్కరించబడుతూ ఉండటం చూస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలగకమానదు.


More Bhakti News