ఊరు పిలవగానే వెలసిన వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి భక్తుల పక్షపాతి. తన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే ... వాళ్ల మధ్యనే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. తన భక్తులు ఆలయానికి రావడం ఆలస్యమైతే తానే వారి ఇళ్లకు వెళ్లిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అలాంటిది ఊరు .. ఊరంతా కలిసి ముక్త కంఠంతో పిలిస్తే ఆయన రాకుండా ఉంటాడా? అలా భక్తుల పిలుపుని అందుకుని వచ్చిన వేంకటేశ్వరస్వామి గుంటూరు జిల్లా 'మల్లాది' గ్రామంలో కనిపిస్తాడు.
పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం కృష్ణానదిని దాటుకుని పక్కనే గల ఊరికి వెళ్లేవారట. అయితే వర్షాకాలంలో స్వామి దర్శనం చేసుకోవడం కష్టమవుతూ ఉండటంతో, తమ గ్రామంలో ఆవిర్భవించవలసిందిగా అంతాకలిసి స్వామివారిని ప్రార్ధిస్తారు. భక్తుల పిలుపు కోసమే ఎదురుచూస్తుండే స్వామి ఆ గ్రామంలోని ఒక మర్రిచెట్టులో వెలుస్తాడు. అది గుర్తించిన ప్రజలు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒకసారి వచ్చిన గాలివానకు ఆ చెట్టు నేలకొరుగుతుంది. దాంతో తామేదో అపరాధం చేసి ఉంటామనీ, అందుకే తమని వదిలి స్వామి వెళ్లిపోయాడని భక్తులు బాధపడతారు. భక్తుల ఆందోళనను అర్థం చేసుకున్న స్వామి వాళ్లకి ఆనందాన్ని కలిగించాలని అనుకుంటాడు. తాను ఎక్కడికీ వెళ్ళలేదనీ, అక్కడే ఉన్నానంటూ అనేక మహిమలు చేసి చూపుతాడు. దాంతో భక్తుల సంతోషంతో సంబరాలు జరుపుకుంటారు.
ఇక్కడి వేంకటేశ్వరుడిని తాము ఎంతగా ప్రేమిస్తామో ... అంతకన్నా ఎక్కువగా ఆయన తమని ఇష్టపడతాడని భక్తులు చెబుతుంటారు. ఈ గ్రామ ప్రజలు తమ కష్టనష్టాలు ఆయనకి చెప్పుకుంటూనే, ఆయనకి ఎలాంటి కష్టం కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. అనునిత్యం ఆయన సేవచేస్తూ అనిర్వచనీయమైన ఆనందానుభూతులు పొందుతుంటారు.