దేవుడి విగ్రహాన్ని కదిలిస్తే కలిగే ఫలితం !

ఒక్కోసారి ఎంత గొప్పవారైనా తాము తీసుకునే నిర్ణయాల వలన నానాతిప్పలు పడుతుంటారు. అధికారం ... ఎవరూ అడ్డుచెప్పడానికి వీల్లేని రాజరికం కారణంగా కొంతమంది తమకి తోచిన విధంగా నడచుకుని ఇబ్బందుల్లో పడిన సంఘటనలు చరిత్రలో చాలానే కనిపిస్తుంటాయి. అలాంటి వారిలో కర్ణాటక ప్రాంతానికి చెందిన రాజు 'కృష్ణరాజ ఒడైయార్' ఒకడుగా కనిపిస్తాడు.
కర్ణాటకలోని 'మళూరు' అనే క్షేత్రంలో శ్రీమహావిష్ణువు ... 'అప్రమేయస్వామి' గా పూజలు అందుకుంటూ ఉంటాడు. స్వామివారే ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన కారణంగా, ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడే గల ప్రత్యేక మందిరంలో ... చేతిలో వెన్నముద్దను ధరించి పారాడే బాలకృష్ణుడు నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాడు.
ఈ బాలకృష్ణుడి ప్రతిమ మహిమాన్వితమైనదనే విషయాన్ని అక్కడివాళ్లు పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటారు. జీవం తొణికిసలాడుతూ కనిపించే ఈ బాలకృష్ణుడి ప్రతిమ రాజు గారికి ఎంతగానో నచ్చుతుంది. ఇంత ముచ్చటగా కనిపించే ఈ విగ్రహం ఆలయంలో కన్నా తన ఇంట్లో ఉంటే బాగుంటుందని ఆయన భావిస్తాడు. అనుకున్నదే తడవుగా ఆ విగ్రహాన్ని తనతో తీసుకువెళ్లి ఇంట్లో పెడతాడు. అందమైన ఆ ప్రతిమను అనునిత్యం చూసుకోవచ్చుననుకున్న ఆయనకి, ఆ ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి అపరాధం చేశానని అనిపించలేదు.
ఆ రోజు నుంచే ఆయనకి ఇటు కుటుంబ సంబంధమైన ... అటు పరిపాలనా సంబంధమైన సమస్యలు తలెత్తసాగాయి. ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వాటికి తోడవుతాయి. దాంతో వాటి బారి నుంచి బయటపడలేక ఆయన సతమతమైపోసాగాడు. అధికారం ఉందనే కారణంగా ఆలయంలోని బాలకృష్ణుడి ప్రతిమను ఇంటికి తీసుకురావడమే జరుగుతున్న పరిణామాలకు కారణమనే విషయాన్ని విజ్ఞులు ఆయన దృష్టికి తీసుకువస్తారు. వెంటనే ఆయన ఆ విగ్రహాన్ని ఆలయానికి తీసుకువెళ్లి యథాస్థానంలో ప్రతిష్ఠ చేయిస్తాడు. దాంతో ఆయన కష్టాలన్నీ మబ్బుతెప్పల్లా తెలిపోయాయని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.