టేకాఫ్‌కు క్షణాల ముందు విమానం డోర్ తెరిచిన ప్రయాణికుడు

టేకాఫ్‌కు క్షణాల ముందు విమానం డోర్ తెరిచిన ప్రయాణికుడు
  • డోర్ తెరిచిన వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు
  • జోధ్‌పూర్ నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో ఘటన
  • ఇరవై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన విమానం
టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానం ఎమర్జెన్సీ డోర్‌ను ఓ ప్రయాణికుడు తెరవడం కలకలం రేపింది. డోర్ తెరిచిన వ్యక్తిని విమానాశ్రయ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఈరోజు ఉదయం ఇండిగో విమానం సిద్ధమైంది.

కొన్ని క్షణాల్లో టేకాఫ్ అవుతుందనగా ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది పైలట్‌కు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తిని విమానంలో నుంచి దించేయగా... సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ ఘటనతో ఇండిగో విమానం ఇరవై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఓ ప్రయాణికుడు డోర్ తెరిచాడని, దీంతో మిగిలిన ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని, అందుకు చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.


More Telugu News