హైదరాబాద్ రోడ్డు విస్తరణ కోసం జానారెడ్డి, బాలకృష్ణ నివాసాల వద్ద మార్కింగ్

  • కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయం
  • రోడ్డు వెడల్పు కోసం పలువురి ఇళ్లకు అధికారుల మార్కింగ్
  • బాలకృష్ణ నివాసం వద్ద ఆరు అడుగుల మేర మార్కింగ్
మాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసాలకు అధికారులు మార్కింగ్ వేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో రోడ్డు వెడల్పు చేయడానికి పలువురి ఇళ్లకు అధికారులు మార్కింగ్ వేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేశారు. బాలకృష్ణ నివాసానికి దాదాపు ఆరు అడుగుల మేర మార్కింగ్ వేశారు. తమ నివాసాలకు మార్కింగ్ చేయడంపై వారు ఒకింత అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్‌లు, ఎనిమిది చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జుబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్డు నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజ్ అగ్రసేన్, క్యాన్సర్ ఆసుపత్రి, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ ఉన్నాయి.

జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. అలాగే జుబ్లీహల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్డు నెంబర్ 36 వైపు వెళ్లే దారిలో ఫ్లై ఓవర్లు రానున్నాయి.


More Telugu News