ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదు: హరీశ్ రావు

  • ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని గప్పాలు కొడుతున్నారని విమర్శ
  • 14వ తేదీ వచ్చినా జీతాలు రాలేదన్న హరీశ్ రావు
  • ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తోన్న ప్రచారం ఆపాలన్న హరీశ్ రావు
ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 14 రోజులు గడిచినా ఇంకా జీతాలు రాలేదని మండిపడ్డారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు గప్పాలు కొట్టారని, కానీ ఈ నెల 14వ తేదీ వచ్చినా అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు చెల్లించలేదని విమర్శించారు. పది నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దెలు చెల్లించని దుస్థితి నెలకొందన్నారు. 

రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నారన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు... ఇలా ఎంతోమందికి సకాలంలో వేతనాలు రావడం లేదని, దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న ప్రచారం ఇకనైనా ఆపాలన్నారు.


More Telugu News